ఉత్తర కొరియాలో భారీ పేలుళ్లు సంభవించాయని వస్తోన్న వార్తలకు ఓ వీడియో ఆధారాన్నిస్తోంది. చైనా సరిహద్దులో ఉండే హైసాన్ నగరంలోని నివాస ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగినట్లు స్పష్టమవుతోంది. అందులో శబ్దాలను బట్టి భారీ ప్రమాదమే జరిగిందని ఆర్థమవుతోంది. జనావాసాల మధ్య పేలుడు జరగటం వల్ల ప్రాణనష్టం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ విషయంపై ఉత్తర కొరియా కానీ, చైనా కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగానే తమ అంతర్గత విషయాల గురించి ఉత్తర కొరియా ఎక్కువగా బయటకు వెల్లడించదు. అయితే ఇలాంటి భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మౌనం వహించటం అనుమానాలకు తావిస్తోంది.
నగరంలోని నివాస ప్రాంతాల్లో గ్యాస్ విస్ఫోటనం జరిగిందని, పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని దక్షిణ కొరియా మీడియా, ఇతర సంస్థలు నివేదించాయి.
చైనా నుంచి తీసిన వీడియో..
"నేను ఆ పేలుళ్లను చూశాను. పేలుళ్లకు కారణం మాకు తెలియదు. ఈ పేలుళ్లు నగరంలోని వృద్ధాశ్రమం సమీపంలో జరిగి ఉండవచ్చు."
- వాంగ్ బో, వీడియో తీసిన వ్యక్తి
ఇటువంటి ప్రమాదాల వివరాలను ఉత్తర కొరియా చాలా అరుదుగా వెల్లడిస్తుంది. 2017లో జరిగిన ఓ మైనింగ్ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలిపింది. అంతకుముందు 2014లో ప్యాంగ్యాంగ్లో ఓ నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో ప్రజలను క్షమాపణలు కోరింది.
ఇదీ చూడండి: లెబనాన్ పేలుడు ఘటనలో 100కు చేరిన మృతులు