ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఆప్త మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. కరోనాపై పోరాడుతున్న భారత్కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తానని ప్రకటించారు ట్రంప్.
ట్రంప్, మోదీల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. గతనెలలో అమెరికా కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతిచ్చింది. దీంతో భారత్ అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో భారత్కు.. వైరస్ను ఎదుర్కోవడంలో పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు ట్రంప్.
కరోనా వైరస్ను అంతం చేసే వ్యాక్సిన్ను కనుగొనేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు. ఈ ఏడాది చివరిలోగా కరోనాకు వ్యాక్సిన్ తయారవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తల మేధస్సు అద్భుతమని ప్రశంసించారు.
"భారత్లోని మన మిత్రులకు వెంటిలేటర్లు విరాళంగా ఇవ్వడం నాకు గర్వంగా ఉంది. ప్రధాని మోదీ నాకు మంచి మిత్రులని మీ అందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితమే నేను ఇండియాకు వెళ్లి వచ్చాను. ఆ సమయంలో మేమిద్దరం మరింత ఆప్తులమయ్యాం. ఇప్పుడు కనిపించని శత్రువుతో పోరాడేందుకు మేము ఆ దేశానికి, మోదీకి అండగా ఉంటాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇక వెంటిలేటర్ల కొరత లేని అనేక దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంటుందని శ్వేతసౌధం అధికార ప్రతినిధి కైలీ మెక్‌నానీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కరోనా తొలి నమూనాలను లేకుండా చేశాం: చైనా