తాలిబన్లు హింసను విడనాడి శాంతి చర్చలు తిరిగి కొనసాగించాలని కోరింది అమెరికా. కొద్ది రోజులుగా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లోని అగ్రరాజ్య సైనిక విభాగం ఈమేరకు ఓ లేఖ రాసింది. హింసను ఆపకపోతే.. తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌కు అరుదైన రీతిలో 2 పేజీల లేఖ రాశారు అఫ్గాన్‌లోని అమెరికా భద్రత దళాల ప్రతినిధి కల్నల్ సోనీ లెగెట్. రక్తపాతం జరగకుండా ఉండేందుకు ఇరువైపులా సంయమనం పాటించాలని సూచించారు. హింసాత్మక ఘటనలపై అఫ్గాన్‌లోని యూఎస్, నాటో దళాలకు నేతృత్వం వహిస్తున్న జనరల్ స్కాట్ మిల్లర్ హెచ్చరికలు చేసిన కొద్ది రోజులకే ఈ లేఖ రాయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
" ఒకవేళ హింసాత్మక ఘటనలు ఆపకపోతే తగిన చర్యలు ఉంటాయి. భాగస్వామ్యపక్షాలన్నీ తప్పకుండా తిరిగి రాజకీయ మార్గంలోకి వచ్చి శాంతి చర్చలు కొనసాగించాలి. అఫ్గాన్లు కూర్చుని దేశ భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి. అఫ్గాన్‌లో హింసను 80 శాతం మేర తగ్గిస్తామని తాలిబన్లు ఒప్పుకున్నారు. కానీ దానికి బదులు హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి."
- కల్నల్ సోనీ లెగెట్, అమెరికా బలగాల ప్రతినిధి
అమెరికా-తాలిబన్ల మధ్య ఈఏడాది ఫిబ్రవరి 29న ఒప్పందం కుదిరింది. యూఎస్, విదేశీ దళాలపై దాడులు చేయబోమని .. కాబుల్ అధికారులతో శాంతి చర్చలు కొనసాగిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారు. తాలిబన్లపై దాడులు చేయమని అమెరికా సైతం భరోసా ఇచ్చింది. ఈ ఒప్పందం నేపథ్యంలో అఫ్గాన్‌లోని అమెరికా బలగాలను 14 నెలల్లో తరలించాలి. అయినప్పటికీ.. కొద్ది రోజులుగా దాడులు పెరుగుతున్నాయి.
రెచ్చగొట్టే ప్రకటనలు..
అమెరికా సైన్యం లేఖ రాయటాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు తాలిబన్ ప్రతినిధి ముజాహిద్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించాడు. "మా వైపు మేము కట్టుబడి ఉన్నాం.. మీరు మీ బాధ్యతలను గౌరవించండి" అంటూ ట్వీట్ చేశాడు.