Ukraine Russia war: ఉక్రెయిన్, తైవాన్‌లు రెండు వేర్వేరు అంశాలనీ, ఒకదానితో ఒకటి సరిపోల్చలేమని చైనా పేర్కొంది. 'తైవాన్ అనేది చైనాలో విడదీయరాని భాగం. అది పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారం. ఉక్రెయిన్ అంశం రెండు దేశాల మధ్య వివాదం' అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం విలేకరుల సమావేశంలో ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ విషయానికి వచ్చేసరికి సార్వభౌమత్వం గురించి మాట్లాడే కొందరు వ్యక్తులు తైవాన్ పట్ల చైనా వాదనను తేలిక చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకే చైనా అనే సిద్ధాంతాన్ని సవాల్ చేసేందుకు అమెరికాలో కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ.. తైవాన్ స్వాతంత్య్రం పేరుతో వేర్పాటువాద శక్తుల్ని ఎగదోస్తున్నాయని ఆరోపించారు.
రష్యాతో భాగస్వామ్యం వ్యూహాత్మకం
చైనాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి రష్యా అని వాంగ్ యీ ఉద్ఘాటించారు. ప్రపంచంలోనే అత్యంత కీలక ద్వైపాక్షిక సంబంధాలు ఈ రెండు దేశాల మధ్య ఉన్నాయన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారినా, తమ భాగస్వామ్యం వర్థిల్లుతుందని ప్రకటించారు. రష్యాపై అమెరికా, ఈయూ విధించిన ఆంక్షలు.. సమస్యకు రాజకీయ పరిష్కారం చిక్కకుండా అడ్డుపడతాయని హెచ్చరించారు. కొన్ని శక్తులు భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలను ఎగదోయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇటీవల సరిహద్దు వివాదాలు ఏర్పడినా అవి ద్వైపాక్షిక సహకార వృద్ధికి అడ్డు రాకూడదన్నారు.
ఇదీ చూడండి: Ukraine Russia talks: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు అసంపూర్ణం