Ukraine Crisis: ఉక్రెయిన్‌లో వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టి, తనకు విశ్వాసపాత్రుడైన విక్టర్ యానుకోవిచ్‌ను అధ్యక్షుడిగా నియమించాలని రష్యా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే 8 ఏళ్ల తర్వాత విక్టర్ మళ్లీ ఉక్రెయిన్ తెరపైకి వచ్చినట్లవుతుంది.
ఎవరీ విక్టర్?
విక్టర్ యానుకోవిచ్.. 2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన రష్యాకు అనుకూలమైన వ్యక్తి. అధ్యక్ష హోదాలో.. ఐరోపా సంఘం (ఈయూ)తో రాజకీయ, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో 2013 నవంబర్ నుంచి ఉక్రెయిన్‌లో నిరసనలు మొదలయ్యాయి. అల్లర్లు, కాల్పులతో భారీగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి కారణంగా 2014 ఫిబ్రవరిలో విక్టర్ పదవీచ్యుతుడయ్యారు. అనంతరం ఆయన రష్యాకు పారిపోయారు. నాటి నుంచి అక్కడే ప్రవాసంలో ఉంటున్నారు. రష్యా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం, గతంలో ఉక్రెయిన్‌కు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడై ఉండటం వంటి కారణాల వల్ల విక్టర్‌కు పుతిన్ మరోసారి పదవిని కట్టబెట్టవచ్చు. ఐరోపాలో మరోసారి రష్యా ప్రాబల్యాన్ని చాటడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: యుద్ధానికి వారం.. ఎటు చూసినా హింస, విధ్వంసమే