కర్తార్‌పూర్ ఒప్పంద ముసాయిదాపై చర్చించేందుకు మార్చి 14న ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత తాత్కాలిక హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ఈ నిర్ణయాన్ని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రస్తుత పరిణామం ఒక సానుకూల అంశంగా నిపుణులు పేర్కొన్నారు.
వీసా లేకుండా దర్శనం...
పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లే వారికి వీసా అవసరం లేని దర్శనానికి వీలు కల్పించేదే ఈ ఒప్పందం. ఈ గురుద్వారా నరోవాల్ జిల్లాలో రావి నది ఒడ్డున ఉంది. సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ దీనిని స్థాపించారు. ఇదే మొదటి గురుద్వారా కావడం విశేషం.
ఇరు దేశాల రక్షణ శాఖ అధికారుల మధ్య డైరెక్టరేట్స్ స్థాయిలో జరిగే చర్చలను కొనసాగించటానికి పాక్ సిద్ధంగా ఉందని అహ్లువాలియాకు తెలిపారు పాక్ ప్రతినిధి.