దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ.. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేశారు. భారత్ నుంచి దుబాయ్ మధ్య తిరిగే.. అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. ఏప్రిల్ 24 శుక్రవారం అర్ధరాత్రి నుంచి.. 10 రోజుల పాటు అన్ని తరగతుల విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అరబ్ ఎమిరెట్స్ ప్రకటన విడుదల చేసింది. గత 14 రోజుల్లో భారత్‌కు వచ్చిన వారు సైతం ఇతర దేశాల నుంచీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే.. దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చే విమానాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలులకు మినాహాయింపునిచ్చింది.
విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు..
భారత్ వంటి కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల నుంచి విమానాల రాకపోకలను తగ్గించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు. ఆయా దేశాల నుంచి 30 శాతం మేర విమానాలను రద్దు చేయనున్నట్లు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే.. కరోనా ఉద్ధృతి ఉన్న దేశాలకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరులపైనా ఆంక్షలు ఉంటాయన్నారు. 14 రోజుల క్రితం ఆయా దేశాల్లో పర్యటిస్తే.. విమానం ఎక్కే 72 గంటల ముందే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలన్నారు.
అదనపు ఫ్లైట్స్‌కు నో..
ఇప్పటికే భారత్‌ను 'రెడ్ లిస్ట్'లో పెట్టింది బ్రిటన్. భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ రెడ్ లిస్ట్‌లో ఉన్న కారణంగా అదనపు విమానాలకు నిరాకరించింది లండన్‌లోని హీత్రోవ్ విమానాశ్రయం. భారత్ నుంచి 8 అదనపు విమానాలను అనుమతించాలని నాలుగు విమానయాన సంస్థలు చేసిన వినతిని తోసిపుచ్చింది. విమానాశ్రయంలో ఎక్కువ జనం గుమిగూడకుండా, పాస్‌పోర్ట్ తనిఖీ కేంద్రాల వద్ద బారులు తీరకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు విమానాశ్రయ అధికారులు.
కోల్‌కతా-షిల్లాంగ్ మధ్య బంద్
కోల్‌కతా-షిల్లాంగ్ మధ్య రోజువారీ విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది ఇండిగో సంస్థ. శుక్రవారం నుంచి 8 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే.. విమాన సంస్థ కారణం వెల్లడించకపోయినప్పటికీ, కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షిల్లాంగ్ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లు తొలగించాలి..
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విమానయాన సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్షలను తక్షణమే నిలిపివేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏను కోరింది పైలట్ల సంఘం(ఎఫ్ఐపీ). ఈ యంత్రాలు తరుచుగా ఎక్కువగా ఉపయోగించటం ద్వారా ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ సోకే ప్రమాదం ఉందని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్‌కు లేఖ రేసింది.
ఇదీ చూడండి: జలాంతర్గామి కోసం గాలింపు- రంగంలోకి భారత్