వారం రోజులుగా దక్షిణ జపాన్ ద్వీపాలను అతలాకుతలం చేసిన హేషిన్ తుపాను దక్షిణ కొరియా వైపు ప్రయాణిస్తోంది. కొరియాలోని ఆగ్నేయ తీరాన్ని సోమవారం తాకే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గాలుల వేగం 144 కిలోమీటర్ల ఉంటుందని హెచ్చరించింది.
జపాన్లో దక్షిణ భాగంలో హేషిన్ విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి చాలా ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడటం వల్ల దక్షిణ ద్వీపంలో సుమారు 5 లక్షల ఇళ్లు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. ఒకినావా, ఇతర ద్వీపాల్లో వారాంతంలో భారీ వర్షాలు కురిశాయి. భారీ అలలు తీరాలపై విరుచుకుపడ్డాయి.
ఇంకా వీడని ప్రభావం..
తుపాను ప్రభావం తగ్గినా జపాన్ ఇంకా కోలుకోలేదు. తుపాను ఉత్తరం వైపు ప్రయాణించినా.. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బుల్లెట్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు రద్దు చేశారు.
నౌక మునక...
గత వారంలో జపాన్, కొరియా ద్వీపకల్పాలపై మేసాక్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 6 వేల ఆవులతో వెళుతున్న నౌక దక్షిణ జపాన్ సమీపంలో నీట మునిగింది. ఇందులో మొత్తం 43 మంది సిబ్బంది ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయపడ్డారు. ఒకరి మృతదేహం లభించింది. అయితే, హేషిన్ తుపాను కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఇదీ చూడండి: 5,800 ఆవులతో వెళ్తూ మునిగిన నౌక