ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వేళ.. కాలం చైనాకు అనుకూలంగా ఉందని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ తెలిపారు. సమయానికి అనుగుణంగా చైనా ఊపందుకుంటుందన్నారు.
సీపీసీ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు జిన్పింగ్. ఈ సందర్భంగా రానున్న 30ఏళ్లల్లో చైనాను గొప్ప స్థాయిలో నిలిపే విధంగా పార్టీ రూపుదిద్దుకుంటుందన్నారు.
"శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. కానీ కాలం మాత్రం చైనా వైపు ఉంది. మన విశ్వాసం, దృఢ సంకల్పాన్ని చూపించాల్సిన సమయం ఇది."
--- జిన్పింగ్, చైనా అధ్యక్షుడు.
కరోనా సంక్షోభం, ప్రపంచ దేశాలతో బలహీనపడుతున్న బంధాలు, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ వంటి సమస్యలతో చైనా అతలాకుతలమవుతున్నప్పటికీ.. సోమవారం జరిగిన కార్యక్రమంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చూడండి:- చైనా సైన్యానికి జిన్పింగ్ కీలక ఆదేశాలు
శక్తిమంతమైన నేతగా..
2012లో అధికారం చేపట్టిన జిన్పింగ్.. తక్కువ సమయంలో ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతగా ఎదిగారు. రెండుసార్లే అధ్యక్షుడిగా కొనసాగవచ్చన్న రాజ్యాంగాన్ని సవరించి.. జీవితకాలం పాటు సాగే విధంగా చట్టాన్ని అమలు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, సైన్యాధ్యక్షుడిగా ఎన్నో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు జిన్పింగ్.
అంతకుముందు మావో షీడాంగ్కు ఇంతటి ప్రాముఖ్యం ఉండేది. 1921లో సీపీసీని స్థాపించిన మావో.. 1949లో అధికారాన్ని చేపట్టారు.
ఇదీ చూడండి:- డబ్ల్యూహెచ్ఓ బృందం వుహాన్ పర్యటన ఖరారు