పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గుజ్రన్వాలాలో జరిగిన ఈ ర్యాలీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలంతా పాల్గొన్నారు.
దేశంలో అమయాక ప్రజలపై సైన్యం జరుపుతున్న దాడులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అవినీతిలో కూరుకుపోయిన ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని నినదించాయి. పాకిస్థాన్లో ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ర్యాలీకి పెద్దఎత్తున ప్రజలు మద్ధతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా.. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీలో పాల్గొన్నారు. తనను ప్రధాని బాధ్యతల నుంచి తప్పించి.. ఇమ్రాన్ ఖాన్కు పగ్గాలు అప్పగించడం వెనుక రక్షణ శాఖ ప్రమేయం ఉందని షరీఫ్ తన ప్రసంగంలో ఆరోపించారు.
ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరిన్ని ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో 11 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం)ల ఆధ్వర్యంలో జరిగిన మొదటి ర్యాలీ ఇది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమియత్ ఉలెమా-ఇ-ఇస్లాం-ఫజల్లు ఈ కూటమిలో ప్రధానంగా ఉన్నాయి.