కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని గడగడలాడించి, అన్ని వర్గాల వారినీ తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేసిన కరోనా వైరస్ బయటపడి మంగళవారానికి ఏడాది పూర్తవుతోంది!! ఇది కచ్చితంగా ఎప్పుడు బయటపడిందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నా.. చైనా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకిస్తూ.. కరోనాకు ఈ నెల 17తో ఏడాది పూర్తవుతోందని హాంకాంగ్ కేంద్రంగా వెలువడే 'ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' పేర్కొంది. చైనాలోని హుబెయ్ రాష్ట్రంలో 2019 నవంబరు 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలికేసు వెలుగు చూసిందని ఆ పత్రిక వెల్లడించింది. అయితే చైనాలో 2019 డిసెంబరు 8న కరోనా తొలికేసు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా.. డిసెంబరు 1న తొలికేసు వచ్చినట్లు 'ది లాన్సెట్' కథనం స్పష్టంచేసింది.
కరోనా వెలుగుచూసిన తొలినాళ్లలో రోజుకు గరిష్ఠంగా ఐదు కేసులు వచ్చేవి. గత ఏడాది డిసెంబరు 15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. చాలా మంది వైద్యులు అవన్నీ మామూలు వైరస్ కేసులేనని పొరపడినా.. ఆ నెల 27న హుబెయ్‌లోని ఒక వైద్యుడు మాత్రం ఇవన్నీ కొత్తరకం కరోనా వైరస్‌వేనని గుర్తించారు. వైరస్ ఎలా తీవ్రతరమైందో తెలిపే గణాంకాలను ప్రభుత్వం వెల్లడించకపోయినా దాని ఉద్ధృతి మాత్రం వ్యవస్థల్ని కకావికలం చేసింది.
మొట్టమొదటగా ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి(పేషెంట్ జీరో) ప్రస్తుత స్థితిని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. తద్వారా అసలు ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో తెలుసుకోవచ్చనేది వారి ఉద్దేశం. గబ్బిలం నుంచి గానీ, మరేదైనా జంతువు నుంచి గానీ ఇది మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందనేది ఎక్కువమంది నమ్మకం.
ప్రపంచ దేశాల ఉలికిపాటు
హుబెయ్ రాజధాని వుహాన్ నగరంలో ఈ ఏడాది జనవరిలో మహమ్మారి తీవ్రత గురించి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడ్డాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా దేశదేశాలకూ వైరస్ పాకి, లాక్‌డౌన్ వంటి అనేక ఆంక్షలకు కారణమై ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. అగ్రరాజ్యాధినేత సహా ఇప్పటివరకు 5.50 కోట్ల మందికి సోకింది. పెద్దఎత్తున ప్రాణ నష్టానికీ దారితీసింది. 2019లోనే కరోనా బారిన పడిన కనీసం 266 మందిని చైనా అధికార వర్గాలు ఇంతవరకు గుర్తించాయి. వీరందరూ ఏదో ఒక దశలో వైద్య చికిత్స పొందారు. తొలిదశలో కరోనా తీవ్రతను గుర్తించడంలో విఫలం కావడం చైనాపై పెను ప్రభావాన్ని చూపింది. తర్వాత యావత్ ప్రపంచం దాని పరిణామాలను అనుభవించాల్సి వచ్చింది. ఇది ‘చైనా వైరస్’ అంటూ అమెరికా అనేకసార్లు విమర్శించింది.
ఇంతింతై... ప్రపంచమంతై..
- 2019 డిసెంబరు 27: సార్స్ తరహా వ్యాధి కారక లక్షణాలు పలువురిలో కనిపిస్తున్నట్లు హుబెయ్ ప్రావిన్సులోని ఒక వైద్యుడు అధికార వర్గాలకు తెలిపారు.
- 2020 జనవరి 1: అంతుచిక్కని నిమోనియాతో పోరాడుతున్నట్లు వుహాన్‌లోని ఒక ఆసుపత్రి తెలిపింది.
- జనవరి 13: చైనాలోని వుహాన్ నుంచి థాయిలాండ్‌కు ప్రయాణించిన వ్యక్తిలో వెలుగుచూసిన కరోనా
- జనవరి 15: వుహాన్ నుంచి వెళ్లిన వ్యక్తి ద్వారా అమెరికాకు చేరిన మహమ్మారి
- జనవరి 20: ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకుతుందని చైనా నిపుణులు తేల్చారు.
- జనవరి 23: వుహాన్‌లో లాక్‌డౌన్
- జనవరి 26: వన్య ప్రాణుల వ్యాపారంపై చైనా తాత్కాలిక నిషేధం
- జనవరి 30: ప్రపంచ మానవాళికి కొవిడ్-19తో ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. అదేరోజు భారత్‌లో (కేరళలో) వెలుగులోకి తొలికేసు.
ఇదీ చూడండి:మోడెర్నా వ్యాక్సిన్ ప్రకటనపై ట్రంప్-బైడెన్ హర్షం