పంజ్‌షేర్ లోయలోకి (Panjshir valley) తమ బలగాలు ప్రవేశించాయన్న తాలిబన్ల(Afghanistan Taliban) వ్యాఖ్యలను తోసిపుచ్చింది అక్కడి తిరుగుబాటు దళం. తాలిబన్ల నుంచి ఏ ఒక్కరూ.. పంజ్‌షేర్ రాష్ట్రంలోకి ఇప్పటివరకు అడుగుపెట్టలేదని ప్రకటించారు అహ్మద్ మసూద్ మద్దతుదారులు. ఈ మేరకు అఫ్గానిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్‌కు వెల్లడించారు.
''పంజ్‌షేర్‌లో ఇప్పటివరకు ఎలాంటి పోరాటం జరగలేదు. ఈ రాష్ట్రంలోకి ఎవరూ అడుగుపెట్టలేదు.''
- మహ్మద్ అమాస్ జాహిద్, తిరుగుబాటు ప్రతినిధి బృందం అధినేత
అంతకుముందు.. తమ బలగాలు పంజ్‌షేర్‌లోకి (Panjshir valley) ప్రవేశించాయని ప్రకటించారు తాలిబన్లు.
''యుద్ధం జరగలేదు. కానీ.. తాలిబన్లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. వివిధ మార్గాల నుంచి తాలిబన్ దళాలు.. పంజ్‌షేర్‌లోకి ప్రవేశించాయి.''
- అనాముల్లా సమంఘాని, తాలిబన్ సాంస్కృతిక కమిటీ సభ్యుడు
కాబుల్ విమానాశ్రయం(Kabul Airport) సహా అఫ్గానిస్థాన్‌లోని కీలక ప్రాంతాలను తమ వశం చేసుకున్న తాలిబన్లకు.. పంజ్‌షేర్ నుంచి సవాల్ ఎదురైంది. దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ (Ahmed Shah Masood) తనయుడు అహ్మద్ మసూద్(Ahmad Massoud), అఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కలిసి.. తాలిబన్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఉన్న పంజ్‌షేర్ అంటే తాలిబన్లకు ఎప్పటినుంచో వెన్నులో వణుకు. అందుకే.. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనే ముందు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
తాలిబన్లు, ఆల్‌ఖైదా ముష్కరులు (AL qaeda) కలిసి నకిలీ విలేకరుల వేషంలో.. ఆత్మాహుతి దాడి జరిపి 2001 సెప్టెంబర్ 9న అహ్మద్ షా మసూద్‌ను పొట్టనపెట్టుకున్నారు. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఆయన తనయుడు అహ్మద్ మసూద్.
ఇవీ చదవండి: Panjshir valley: 'పంజ్‌షేర్' తాలిబన్లకు లొంగుతుందా?
Panjshir Valley: 'పంజ్‌షేర్'లో నిశ్శబ్దం- తుపాను ముందు ప్రశాంతతా?