అఫ్గానిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ.. పౌరులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఘజ్నీ రాష్ట్రంలోని మలిస్థాన్ జిల్లాలో 43 మంది పౌరులు, భద్రతా దళాల సభ్యులను విచక్షణా రహితంగా కాల్చి చంపారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది.
"మలిస్థాన్ జిల్లాలో తాలిబన్ ఉగ్రవాదులు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు. యుద్ధానికి సంబంధం లేని వ్యక్తులపైనా దాడి చేస్తున్నారు. పౌరుల ఇళ్లలోకి చొరబడి, ఆస్తులను లూటీ చేస్తున్నారు. ఇళ్లను తగలబెట్టారు. దుకాణాలను దోచుకున్నారు."
-మినా నదేరీ, సామాజిక కార్యకర్త
మే నెల నుంచి తాలిబన్ల దూకుడుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవలే కాందహార్ రాష్ట్రంలోని స్పిన్ బోల్దాక్ జిల్లాలో 100 మందికిపైగా పౌరులను తాలిబన్లు హత్య చేశారు. ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, పాకిస్థాన్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న జిల్లాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: రూ.45లక్షల కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య