ఆగస్టు 31.. గడువు ముగిసింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా(Afghanistan Taliban) చిట్టచివరి విమానం సీ-17 వెళ్లిపోయింది. అఫ్గానిస్థాన్ నుంచి చివరి విమానంలో అమెరికా కమాండర్, రాయబారి వెళ్లిపోయారు. అఫ్గాన్ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. కాబుల్ నుంచి ఆశించినంత మందిని తరలించలేకపోయామని అధికారులు తెలిపారు.
"సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబుల్‌లోని హమీద్ కార్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Kabul international airport) నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరింది. దీంతో అఫ్గాన్‌లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది" అని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు. ఆది నుంచి ఇరు పక్షాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని ఈ సందర్భంగా మెకంజీ పేర్కొన్నారు.
దీంతో అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు అఫ్గాన్‌ను(Afghanistan Taliban) ఖాళీ చేశాయి. అయితే గత వారంలో రోజుల నుంచి కాబుల్‌లో చోటుచేసుకున్న బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది.
సంబరాల్లో తాలిబన్లు..
మరోవైపు 20 ఏళ్ల అనంతరం అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు(Afghanistan Taliban) సంబరాలు జరుపుకున్నారు. తుపాకులతో గాలిలో కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
" అమెరికా సైనికులు అంతా వెళ్లిపోయారు. మా దేశానికి పూర్తి స్వాతంత్య్రం వచ్చింది."
-- జబిహుల్లా ముజాయిద్, తాలిబన్ అధికార ప్రతినిధి
వారికి ధన్యవాదాలు..
అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన మొదలుకావటంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.
"గత 17 రోజుల్లో అమెరికా చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా.. 1,20వేల మంది అమెరికా ప్రజలు, అఫ్గాన్ ప్రజలు, సిబ్బందిని తరలించాం. ఈ మేరకు అమెరికా కమాండర్‌కు ధన్యవాదాలు. అమెరికా ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా.. గడువులోగా వారిని తరలించేందుకు కృషి చేసిన కమాండర్‌కు కృతజ్ఞతలు."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
మాటల్లో చెప్పలేను..
కాబుల్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన ఆఖరు విమానం గాల్లోకి ఎగురగానే.. తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. గాల్లోకి ఫైరింగ్ చేశారు. ఈ ఆనందాన్ని తాను మాటల్లో చెప్పలేనని.. ఓ తాలిబన్ ఫైటర్ తెలిపాడు. తమ 20ఏళ్ల త్యాగం ఫలించిందన్నాడు.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత ఆగస్టు15న అఫ్గాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు 31 గడువులోగా తమ సిబ్బందిని (300 మంది) తరలిస్తామని అమెరికా స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కాబుల్‌లో రాకెట్ దాడులు.. మా పనే: ఇస్లామిక్ స్టేట్