వర్చువల్ రియాలిటీ... దృశ్య వీక్షణంలో ఇదో సంచలనం. చరవాణి, టీవీ, థియేటర్లలో దృశ్యాలు కేవలం తెరపైనే చూశామన్న భావన కలుగుతుంది.
వర్చువల్ రియాలిటీ సాంకేతికతో మీరు చూసే వీడియోలో ప్రత్యక్ష అనుభూతిని పొందొచ్చు. అందుకు అనుగుణంగా వీఆర్ హెడ్సెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ ఇప్పటివరకూ ఉన్న సౌలభ్యం. అంతకుమించి అంటూ వచ్చింది తైవాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌టీసీ. మన చేతివేళ్ల కదలికలతో దృశ్యాలను నియంత్రించేలా ' వైవ్ ప్రో' హెడ్సెట్లలో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ.
ఇప్పటికే ఇలాంటి సాంకేతికత ఉన్నా.. దానికోసం ప్రత్యేకమైన చేతి తొడుగు వాడాల్సి వచ్చేది.
వైవ్ ప్రో
'వైవ్ ప్రో' హెడ్‌సెట్‌తో చేతి వేళ్లను కదిలిస్తూ మనం చూస్తున్న దృశ్యాలను నియంత్రించవచ్చు.
హెడ్సెట్ బయటి వైపు రెండు కెమెరాలు ఉంటాయి. మన చేతి కదలికలను 21 పాయింట్లుగా గుర్తిస్తాయి ఈ కెమెరాలు. వీటికి అనుగుణంగా ఐదు ప్రామాణిక సంజ్ఞలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. మన చేతులను కదిలిస్తూ కావాల్సిన విధంగా దృశ్య అనుభూతిని పొందవచ్చు.
'వైవ్ ప్రో' కిట్‌ను డెవలపర్లకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మార్చ్‌లో జరిగిన 'గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్'లో 'వైవ్ ప్రో'ను మొదటి సారిగా ప్రదర్శించింది హెచ్‌టీసీ.
వర్చువల్ రియాలిటీపై మరో సంస్థ 'ఆక్యులస్' పని చేస్తోంది. ఇదే తరహా హెడ్‌సెట్‌ను విపణిలోకి త్వరలో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.