అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో 90 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
లోగార్ రాష్ట్రం పుల్-ఎ-ఆలం పట్టణంలోని ఓ అతిథి గృహంలోకి శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు దూసుకొచ్చింది. అందులోని ఉగ్రవాది తనతో సహా ట్రక్కును పేల్చేయడంతో అతిథిగృహం నేలమట్టమైంది. ఈ ఆత్మాహుతికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలిగే ప్రక్రియ శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బాంబు దాడి జరగడం గమనార్హం. సెప్టెంబర్ 11 నాటికల్లా అఫ్గాన్‌లో ఉన్న దళాల్ని పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా ఇటీవల ప్రకటించింది.
ఇదీ చదవండి: 'ఊబకాయులూ.. కరోనాతో తస్మాత్ జాగ్రత్త!'