ఒకప్పుడు కరోనాను విజయవంతంగా నియంత్రించిన తైవాన్.. మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని తైపీలో వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. తైపీ, న్యూ తైపీలో కొత్తగా 180 వైరస్ కేసులు బయటపడ్డాయి. పూర్తి మహమ్మారి సమయంలో వచ్చిన 164 కేసుల కన్నా అది ఎక్కువ. ఈ వారం మొదట్లో ఒక అంకెలో ఉన్న కేసులు శనివారం నాటికి మూడంకెలకు చేరుకోవడం ఆందోళనకరంగా మారింది.
దీంతో తైపీ సహా న్యూ తైపీ నగర పరిసరాల్లో హెచ్చరిక స్థాయిని అధికారులు శనివారం పెంచారు. 3వ స్థాయి హెచ్చరికను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. 3వ స్థాయిలో బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులు ధరించడం, ఇళ్లలో ఐదుగురు, బహిరంగ ప్రదేశాల్లో 10 మందికి మించి కలవకూడదని ఆంక్షలు విధించారు.
మహమ్మారి తీవ్రత పెరుగుతోందని ఆరోగ్య మంత్రి చెన్ షి చుంగ్ హెచ్చరించారు. 3వ స్థాయిలో ఇప్పటికే సినిమా హాళ్లు, మ్యూజియాలు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు మూతపడ్డాయి.
2.4 కోట్ల జనాభా గల తైవాన్ ద్వీపంలో స్వపాలిత ప్రభుత్వం ఉంది. ఇక్కడ వైరస్ను తొలి నుంచి సమర్థవంతంగా కట్టడి చేస్తోంది. ఇప్పటివరకు తైవాన్లో 1,475 కేసులు, 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. 2 వారాలకు ముందు 100 లోపు కేసులు మాత్రమే బయటపడగా.. గతవారం 344 మంది వైరస్ బారిన పడటం తీవ్రతకు అద్దంపడుతోంది.
ఇదీ చూడండి: 'భారత్లో ఆందోళకరంగా కరోనా పరిస్థితి'