ఈస్టర్ బాంబు పేలుళ్ల తర్వాత భద్రతా సవాళ్లతో పోరాడుతున్న లంకలో నూతన అధ్యక్షుడి ఎన్నికల పోలింగ్ నేడు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈస్టర్ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో 269 మరణించిన ఘటన తర్వాత జరగనుండటం వల్ల ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చూడండి: శ్రీలంక ఎన్నికలు: ఉగ్రదాడి బాధితులు ఎవరి పక్షం?
35 మంది అభ్యర్థులు...
రికార్డు స్థాయిలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన 35 మంది అభ్యర్థులు.. తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కోటీ 59 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ప్రధాన పోటీ మాత్రం 'యునైటెడ్ నేషనల్ పార్టీ'కి చెందిన సాజిత్ ప్రేమదాస, 'శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ'కి చెందిన గోటబయా రాజపక్సల మధ్యే నెలకొంది. జాతీయ భద్రతే ప్రధానాంశంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు.
రాజపక్సకే విజయావకాశాలు..
శ్రీలంక అంతర్గత భద్రత ఈ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈస్టర్ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో 269 మరణించిన తర్వాత లంకేయులు భద్రతపై ఆందోళనగా ఉన్నారని ఈ ఎన్నికల్లో జాతీయ భద్రతపై భరోసా ఇచ్చేవారివైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్సకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాలున్నాయి. తమను ఈసారి గెలిపిస్తే జాతీయ భద్రతను బలోపేతం చేస్తామని శ్రీలంకను సురక్షితంగా మారుస్తామని ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్థులు హామీ ఇచ్చారు.
నిశితంగా గమనిస్తోన్న భారత్, చైనా...
లంకేయులు నూతన సారథిగా ఎవరిని ఎన్నుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నందున భారత్, చైనాలు.. శ్రీలంక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అధ్యక్షుడి ఎన్నికలు ముగిసిన తర్వాత అవలంబించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నాయి.
ఇదీ చూడండి: 'చైనాతో సఖ్యతగా ఉన్నా... భారత్-శ్రీలంక మైత్రి ప్రత్యేకం'