శ్రీలంక ప్రభుత్వం 11 తీవ్రవాద సంస్థలను నిషేధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు అధ్యక్షుడు గోటబయా రాజపక్సా ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 10 నుంచి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
గతంలో శ్రీలంకలో జరిగిన తీవ్రవాద ఘటనల్లో ఆయా సంస్థల హస్తం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో ఐస్ఐస్, అల్ ఖైదా లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో స్థానిక ముస్లిం సంస్థలు సైతం ఉండటం గమనార్హం.
ఐసిస్‌తో సంబంధాలున్న ఇస్లామిస్ట్ ఉగ్రసంస్థ నేషనల్ థవీద్ జమాత్‌కు చెందిన ఉగ్రవాదులు.. గత ఏడాది ఈస్టర్ వేడుకల వేళ శ్రీలంకలోని రద్దీగా ఉండే చర్చ్‌లు, హోటళ్లు లక్ష్యంగా 9 వరుస బాంబు పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 270 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో 9 మంది భారతీయులు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి : కుంభమేళా: భక్తులతో కిక్కిరిసిన హరిద్వార్