కరోనాను కట్టడి చేసేందుకు తాము రూపొందించిన 'స్పుత్నిక్-వీ' టీకా.. 92శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వ్యాక్సిన్- ప్లాసిబోలు అందించిన వలంటీర్లకు సంబంధించిన పరీక్షల మధ్యంతర రిపోర్టుల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది.
"టీకా వాడకం, క్లినికల్ ట్రయల్స్ ఫలితాల వల్ల కొవిడ్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని స్పుత్నిక్-వీ ద్వారా నిరూపితమైంది. మహమ్మారిని ఓడించడంలో ఇది అత్యంత విజయవంతమైన విషయం."
- మిఖైల్ మురాస్కో, రష్యా ఆరోగ్య మంత్రి
ఫైజర్ కంటే మెరుగు!
అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్.. తాము తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్-వీ టీకాపై రష్యా చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆగస్టు 11న తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేపట్టి... ప్రపంచవ్యాప్తంగా టీకా రూపొందించిన మొట్టమొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.
ఈ ప్లాట్‌ఫామే ఆధారం..
20ఏళ్ల సుదీర్ఘ కాలంలో 250కిపైగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన హ్యూమన్ అడెనోవైరల్ వెక్టార్ ప్లాట్‌ఫామ్‌పై స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఆధారపడి ఉంది. 1953లో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌పై చేపట్టిన ప్రయోగాలు.. ఇప్పటివరకు ఎలాంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సుమారు లక్షమంది దీని ఆధారంగా ఆమోదించిన ఔషధాలను పొందారని సమాచారం.
ఇదీ చదవండి: ఇంజెక్షన్‌తో మహిళలకు హెచ్ఐవీ నుంచి రక్షణ