South Korea New President: దక్షిణ కొరియాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్. హోరాహోరీ పోరులో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్ ఓటమిని అంగీకరించగా.. మాజీ ప్రాసిక్యూటర్ సుక్ యోల్ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
కిమ్‌తో తాడోపేడో..!
అధ్యక్షుడి ఎన్నికల్లో గెలుపొందిన సుక్ యోల్.. ఉత్తర కొరియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకుని.. శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మించి, ఉత్తర కొరియా కవ్వింపులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. పక్కలో బల్లెంలా ఉన్న ఉత్తర కొరియాతో కఠిన వైఖరి అవలంబించనున్నట్లు చెప్పారు. మే నెలలో పదవీ బాధ్యతలు చేపట్టనున్న సుక్ యోల్.. తన విదేశాంగ విధానం గురించి వెల్లడించారు. అమెరికాతో సంబంధాలు పటిష్ఠం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
"దక్షిణ కొరియా, అమెరికా కూటమిని పునర్నిర్మిస్తాను. ఉదారవాద ప్రజాస్వామ్యం, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వంటి కీలక ప్రయోజనాలు దృష్ట్యా వ్యూహాత్మక సమగ్ర కూటమిగా ఏర్పాటు చేస్తాను. ప్రజల భద్రత, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మిస్తాను" అని సుక్ యోల్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు సుక్ యోల్. చైనా, ఉత్తర కొరియావైపు మూన్ జే ఇన్ మొగ్గు చూపుతున్నారని.. ఈ క్రమంలో అమెరికా నుంచి దూరంగా ఉన్నారని ఆరోపించారు.
బైడెన్ ఫోన్..
South Korea US relations: ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సుక్ యోల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు శ్వేతసౌధం తెలిపింది. బైడెన్.. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుక్యోల్కు శుభాకాంక్షలు చెప్పారని.. దక్షిణ కొరియా రక్షణకు అమెరికా కట్టుబడి ఉంటుందని చెప్పినట్లు వెల్లడించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ క్షిపణి పరీక్షల రూపంలో వచ్చే బెదిరింపులను ఎదుర్కొనేందుకు సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించడానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నారని ప్రకటనలో పేర్కొంది శ్వేతసౌధం.
ఇదీ చూడండి: ట్రంప్‌కు తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్!