చైనాలో మొదలైన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. దక్షిణ కొరియాలో సోమవారం మరో 161 కేసులను గుర్తించారు అధికారులు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 763కు చేరింది. ఈ నేపథ్యంలో చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది.
కొత్తగా నమోదైన కేసుల్లో 129మంది డేగులోని షిన్చియోంజి చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. మహమ్మారి వల్ల తాజాగా మరో ఇద్దరు మరణించగా.. మృతుల సంఖ్య 7కు పెరిగింది.
ప్రభుత్వ చర్యలు...
వైరస్ నేపథ్యంలో మహమ్మారి తీవ్రతను అత్యధిక ప్రమాదకర స్థాయిగా ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్. మరోవైపు పాఠశాల సెలవులను ఇంకో వారానికి పొడిగించింది ప్రభుత్వం. చైనా నుంచి వచ్చే వారిని రెండు వారాల పాట పర్యవేక్షణలో ఉంచాలని యోచిస్తోంది.
ఫిబ్రవరి 10న కరోనా వైరస్ బారిన పడ్డ ఓ మహిళ.. అంతకు ముందు నగరంలోని నాలుగు చర్చిలకు హాజరైనట్లు అధికారులు భావిస్తున్నారు. డేగులో సుమారు 2.5 మిలియన్ల జనాభా ఉంటుంది. వైరస్ లక్షణాలున్నట్లు అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్ సూచించారు.