దక్షిణ చైనా సముద్రం అనేది అంతర్జాతీయ సంపద (గ్లోబల్ కామన్స్)లో ఒక భాగమని స్పష్టం చేసింది భారత్. ఈ ప్రాంతం తమ సామ్రాంజ్యంగా చైనా ప్రకటించుకోవటంపై మండిపడింది. అక్కడి అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, గగనతలంలో విమానయానంపై పూర్తి స్వేచ్ఛ భారత్కు ఉందని స్పష్టం చేసింది.
" ఈ విషయంలో మా స్థానం స్పష్టంగా, స్థిరంగా ఉంది. దక్షిణ చైనా సముద్రం అనేది అంతర్జాతీయ సంపద (గ్లోబల్ కామన్స్)లో భాగం. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ చట్టాలు, ముఖ్యంగా యూఎన్సీఎల్ఓఎస్కు లోబడి ఈ అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, గగనతలంలో విమానయానం సహా స్వేచ్ఛాయుత చట్టబద్ధమైన వాణిజ్యం కోసం కృషి చేస్తాం. అలాగే ఏవైనా భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు బెదిరింపులకు పాల్పడకుండా అంతర్జాతీయ చట్టాలు, దౌత్య విధానాలను గౌరవించి శాంతియుతంగా పరిష్కరించుకోవటాన్నే భారత్ నమ్ముతుంది."
- అనురాగ్ శ్రీవాస్తవా, విదేశాంగ శాఖ ప్రతినిధి
అమెరికా ఆగ్రహం..
దక్షిణ చైనా సముద్రంపై చైనా వ్యాఖ్యలను గత సోమవారం( జులై 13న) తీవ్రంగా తప్పుపట్టారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. 21వ శతాబ్దంలో చైనా విస్తరణవాదానికి స్థానం లేదని స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రాన్ని తన సామాజ్యంగా పరిగణించటాన్ని ప్రపంచం అనుమతించదని అన్నారు. ఏకపక్షంగా ప్రకటనలు చేసుకునేందుకు ఎలాంటి చట్టబద్ధత లేదని తేల్చిచెప్పారు. ఆగ్నేయాసియా ప్రాంతంలోని తమ భాగస్వామ్య దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అమెరికా అండగా నిలుస్తుందన్నారు.
ఇదీ చూడండి:పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన