కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అంశంలో ప్రపంచ దేశాల ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాకిస్థాన్ యత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన దక్షిణాసియా స్పీకర్ల సదస్సు... కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని ఏకగ్రీవంగా తీర్మానించింది.
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం చేసిన వాదనలను సదస్సు పట్టించుకోలేదు. సమావేశాల ముగింపు రోజున రౌడ్‌టేబుల్ సమావేశం నిర్వహించిన వివిధ దేశాల ప్రతినిధులు... జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత విషయమని ఏకగ్రీవంగా భావిస్తున్నట్లు తీర్మానంలో ప్రకటించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌పై పాక్ చేసిన సూచనలకు కూడా డిక్లరేషన్‌లో చోటు దక్కలేదని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా... సదస్సులో రూపొందించిన ముసాయిదాకు అనేక సవరణలు ప్రతిపాదించగా వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. దక్షిణాసియా స్పీకర్ల సదస్సులో భారత ప్రతినిధి బృందం.. భూటాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక దేశాల పార్లమెంటరీ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంది.
ఇదీ చూడండి: మహాత్ముడిని భారతజాతి అర్థం చేసుకుందా..?