కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల సింగపూర్ సుప్రీంకోర్టు.. మాదకద్రవ్యాల వ్యాపార కేసులో నిందితుడికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉరిశిక్ష అమలు చేసింది. ప్రముఖ వీడియో చాట్ జూమ్ యాప్లో జరిగిన ఈ విచారణలో మలేసియాకు చెందిన 37ఏళ్ల పునీతన్ జెనాసన్ను.. 2011లో మాదకద్రవ్యాల రవాణా కార్యకలాపాలకు సూత్రధారిగా కోర్టు తేల్చింది.
విచారణంలో జెనాసన్ తరఫు న్యాయవాది ఫెర్నాండో, ప్రాసిక్యూటర్లు వివిధ ప్రాంతాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనగా.. నిందితుడిని జైలు నుంచే ప్రవేశపెట్టారు. ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్ష అమలు చేయడం సింగపూర్ చరిత్రలో ఇదే తొలిసారి.
వైరస్ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం నిబంధనతోనే ఇలా జరగినట్టు.. విచారణపై తమకు ఎటువంటి ఫిర్యాదులు లేవని న్యాయవాది ఫెర్నాండో వెల్లడించారు. అయితే ఉరిశిక్ష తీర్పుపై చర్చించేందుకు జెనాసన్ను కలవనున్నట్లు పేర్కొన్నారు.
కరోనా నియంత్రణలో భాగంగా ఏప్రిల్లో సింగపూర్ లాక్డౌన్ విధించింది. దేశంలో ఇప్పటివరకు 29వేల మందికి ఈ మహమ్మారి సోకగా.. 22మంది ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో ఆంక్షలను సడలించేందుకు యోచిస్తోంది అక్కడి ప్రభుత్వం.
ఇలా ఎందుకు చేయడం?...
అయితే కోర్టు తీర్పుపై మానవ హక్కుల సంఘం తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉరిశీక్ష తీర్పునివ్వడమేంటని ప్రశ్నిచింది.
ప్రాసిక్యూటర్లు, న్యాయస్థానం చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్ష విధించిన కేసుల్లో అసత్య నేరారోపణలు జరుగుతున్నాయన్నది వాస్తవం. ఇప్పుడు సింగపూర్ హడావిడిగా జూమ్ యాప్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం ఆందోళనలు రేకెత్తిస్తోంది.
మానవ హక్కుల సంఘం
సింగపూర్ ఏటా అనేక మందికి ఉరిశిక్ష అమలు చేస్తుందనే విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది మానవ హక్కుల సంఘం. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో తీసుకున్న నిర్ణయంతో.. మానవ హక్కులను ఉల్లంఘించినట్లైందని మండిపడింది.