హాంకాంగ్‌కు చెందిన అతిపెద్ద వర్చువల్ కరెన్సీ ఎక్స్‌ఛేంజి 'బిట్‌ఫినెక్స్' హ్యాకింగ్ వ్యహారం దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.27వేల కోట్లు)ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్రమంలో అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులు నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్, హీథర్ మోర్గాన్ జంటను అరెస్టు చేశారు. వీరు పైకి వ్యాపారవేత్తలుగా, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా చలామణి అవుతున్నారు. దొంగిలించిన బిట్‌కాయిన్లను లాండరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అభియోగాలు మోపారు.
అసలేం జరిగింది..
2016లో హాంకాంగ్‌కు చెందిన బిట్‌ఫినెక్స్ అనే బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజిలో హ్యాకింగ్ జరిగింది. ఆ సమయంలో 1,19,754 బిట్‌కాయిన్లను హ్యాకర్లు అపహరించారు. ఇందుకోసం దాదాపు 2,000 లావాదేవీలు జరిపారు. అప్పట్లో ఈ బిట్‌కాయిన్ల విలువ 71 మిలియన్ డాలర్లు.. కాగా ప్రస్తుతం వాటి విలువను 4.5 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఇలియా లిక్టెన్‌స్టెయిన్ ఆధీనంలోని ఓ డిజిటల్ వాలెట్‌కు ఇవి చేరాయి. వీటిల్లో 25,000 బిట్‌కాయిన్లతో వేర్వేరు ఖాతాలతో లావాదేవీలు జరిపారు. తాజాగా అధికారులు మిగిలిన 94,000 బిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ 3.6 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే ఇదో రికార్డు. ఈ బిట్‌కాయిన్లను కొన్నాళ్లు ఆల్ఫాబే అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఉంచారు. ఆ తర్వాత వీటిని మార్చారు.
చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు ఖర్చు చేస్తూ..
ఇంత మొత్తంలో దొంగిలించిన బిట్‌కాయిన్లు వీరి వద్ద ఉన్నా.. కేవలం చిన్నచిన్న మొత్తాల్లోనే ఖర్చు చేసేవారు. కొంత మొత్తంతో బంగారం, కొన్ని నాన్ ఫంజిబుల్ టోకెన్లు వంటివి కొనుగోలు చేశారు. వాల్‌మార్ట్ గిఫ్ట్ కార్డులు, ఉబర్‌కు చెల్లింపులు, హోటల్స్.కామ్‌లో కొనుగోళ్లు, ప్లేస్టేషన్ల కోసం వీటిని వాడినట్లు గుర్తించారు. దీంతోపాటు తప్పుడు పేర్లను పెట్టి వీటి లావాదేవీలు నిర్వహించారు.
ఇక మనీ లాండరింగ్ కోసం వాడే ప్రత్యేకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్ సాయంతో ఆటోమేటిక్‌గా పెద్ద సంఖ్యలో చిన్న మొత్తాలతో వేర్వేరు వర్చువల్ ఖాతాల్లో, డార్క్‌నెట్‌లోకి బదలాయించేవారు. ఆ తర్వాత విత్‌డ్రా చేసేవారు.
వ్యాపారవేత్తలు.. పెట్టుబడిదారులుగా చెప్పుకొంటూ..
ఇలియా లిక్టెన్‌స్టెయిన్, హీథర్ మోర్గాన్ జంట ప్రొఫైల్ చూస్తే ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే. హీథర్ మోర్గాన్ 2017 నుంచి ఫోర్బ్స్‌లో 2021 సెప్టెంబర్ వరకు కాలమిస్టుగా పనిచేశారు. యూఎస్ ఐఎన్‌సీ పత్రికకు కూడా రాశారు. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్, ప్రొఫైల్ రైటర్, పెట్టుబడిదారుగా చెప్పుకొన్నారు. ఆమె సోషల్ మీడియాలో రజ్లేఖాన్ పేరుతో ర్యాపింగ్ వీడియోలు కూడా చేశారు. తనను తాను సాహసవంతురాలిగా.. 'వాల్‌స్ట్రీట్ మొసలి' గా అభివర్ణించుకొంది.
ఇలియా లిక్టెన్‌స్టెయిన్ అమెరికా పౌరుడు. ఇతడికి రష్యా పౌరసత్వం కూడా ఉంది. లింక్డ్‌ఇన్‌లో బ్లాక్ చైన్ స్టార్టప్ వ్యవస్థాపకుడిగా చెప్పుకొంటున్నాడు. వీరిద్దరిపై మనీలాండరింగ్‌కు పాల్పడేందుకు కుట్రపన్నడం, అమెరికాను మోసగించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు మోపారు.
ఇదీ చూడండి:
ఇప్పటికీ కిమ్‌తో టచ్‌లో డొనాల్డ్ ట్రంప్!