చైనాలో మొదలైన కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఉన్న శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇందుకు గానూ కొన్ని మిలియన్ డాలర్ల వ్యయంతో వ్యాక్సిన్ కనుగొనేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
కరోనా వల్ల ఇప్పటివరకు 800కు పైగా మరణించారు. 37 వేల కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ముందుగా జంతువులపై పరీక్షించి, అనంతరం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ విషయంలో అనేకమంది నిపుణుల బృందాలు వ్యాక్సిన్ను త్వరితగతిన కనుగొనేందుకు పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పీడిస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ కనుగొనాలంటే ఆరునెలల సమయం చాలంటున్నారు.
"ఇప్పడు మాపై పెద్ద బాధ్యత ఉంది. ప్రస్తుతం ఎంతో ఒత్తిడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక బృందాలు ఈ మిషన్లో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో ఏదో ఒకటి విజయవంతమౌతుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సాయపడుతుందని ఆశిస్తున్నాను."
-కీత్ చాపెల్, సీనియర్ పరిశోధకుడు
చైనాలోని వుహాన్ ప్రాంతం నుంచి ఈ వైరస్ వ్యాపించిందని తెలుస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
సీఈపీఐ నేతృత్వంలోనే...
పశ్చిమ ఆఫ్రికాలో గతంలో ఎబోలా వైరస్ కారణంగా 11వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బయోటెక్నాలజీ పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు 2017లో కొయిలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్(సీఈపీఐ) ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంస్థ నేతృత్వంలోనే కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిషన్లో భాగంగా వ్యాక్సిన్ను వేగవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో.. సీఈపీఐ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు ప్రాజెక్టులకు కొన్ని మిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. మరిన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలకూ పిలుపునిచ్చింది. 16 వారాల్లో క్లినికల్ టెస్టింగ్ ప్రారంభించాలనే లక్ష్యంతో ముందడుగేస్తోంది.
వ్యాక్సిన్ కనుగొనకముందే వైరస్ మాయం..
గతంలో 2002-2003 ప్రాంతంలో సార్స్ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు.. వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే వైరస్ అంతమైంది. వైరస్ వ్యాప్తి అంతమైనప్పటికీ వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు కొనసాగాలని పరిశోధకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'అంబానీ' ఒకప్పుడు ధనవంతుడు.. ఇప్పుడు కాదు!