రష్యా సైన్యంలో మార్చి నుంచి ఇప్పటి వరకు 874 మంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 379 మందిని ఇంటి వద్దనే క్వారంటైన్ చేసినట్లు తెలిపారు అధికారులు. మిగతా వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్న అధికారులు.. ఒకరు వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు వివరించారు.
రష్యాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల... ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. లాక్డౌన్ ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వపరంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. తాజాగా... రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా మే 9న జరగాల్సిన సైనిక కవాతును పుతిన్ రద్దు చేశారు.
రష్యాలో ఇవాళ 6 వేల మందికిపైగా వైరస్‌బారిన పడగా, 47 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 87,147కు చేరింది.