అంతరిక్షానికి పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తున్న వీళ్లు.. నిజంగా వ్యోమగాములు కాదు. సినిమా హిరోయిన్, డెరెక్టర్. రోదసిలో షూటింగ్ కోసం మూడు నెలలుగా వీరు కఠోరంగా శ్రమిస్తున్నారు. వ్యోమగామి ఆంటోన్ శ్కాప్లోవ్ సారథ్యంలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు.

ఛాలెంజ్ పేరుతో తెరకెక్కుతున్న రష్యన్ సినిమా షూటింగ్.. దాదాపు 12 రోజుల పాటు స్పేస్‌లో జరగనుంది. దీనికోసమే హీరోయిన్ యులియా పెరెసిల్డ్, డెరెక్టర్ క్లిమ్ షిపెంకో శిక్షణ తీసుకుంటున్నారు. అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడేలా వీరికి శ్కాప్లోవ్ ట్రైనింగ్ ఇస్తున్నారు.
"గత మూడు నెలలుగా మేము సరికొత్త ప్రపంచంలో ఉన్నాం. ఇది కఠినంగా, క్లిష్టంగా ఉంది. నిద్ర పోవడానికి కూడా సమయం దొరకట్లేదు. భూమిపై చిత్రీకరణ అయితే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. జీవితం మారిపోయింది. అంతరిక్షం జీవితాలను మారుస్తుంది. దీనిలా మరేదీ ఉండదు."
--క్లిమ్ షిపెంకో, మూవీ డైరెక్టర్
వ్యోమగామికి సర్జరీ చేసేందుకు డాక్టర్ అంతరిక్షానికి వెళ్లే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ సీన్‌ను నిజంగా రోదసిలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం అంతరిక్షానికి వెళ్లేవారు మూడు నెలల పాటు కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి.

"మేము నెలన్నర పాటు కలిసి శిక్షణలో పాల్గొన్నాం. దీనికంటే ముందు అంతరిక్షంలో మనుగడ సాగించేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి? సున్నా గురుత్వాకర్షణ సమయంలో విమానంలో ఎలా ఉండాలి? అనే విషయాలను నేర్చుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్ అంతరిక్ష విమానయానానికి వీలైనంత దగ్గరగా వెళ్లాం"
--పెరెసిల్డ్, హిరోయిన్.
అంతరిక్షయానం కోసం వేల మంది దరఖాస్తు చేసుకోగా వివిధ పరీక్షల అనంతరం వీరికి అవకాశం దక్కింది. ఈ ఛాలెంజ్ సినిమాను ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ రాస్‌కాస్మోస్, రష్యా ప్రభుత్వ టీవీ ఛానెల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో క్లిమ్ పిషెంకో కూడా నటిస్తున్నారు.


అక్టోబర్ 5న వీళ్లు అంతరిక్షానికి పయనం అవుతారు. 12 రోజుల షూటింగ్ అనంతరం భూమికి తిరిగివస్తారు. అంతరిక్షయానం కోసం ప్రస్తుతం వీరు కజఖ్‌స్థాన్‌లోని బైకొనుర్ కాస్మోడ్రోమ్‌లో సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: రోబోతో అణు శాస్త్రవేత్త హత్య- వేల కి.మీ దూరం నుంచి.. ఆ జ్ఞాపకాలను తలచుకొని తల్లడిల్లుతున్న అఫ్గాన్ కుటుంబాలు