రష్యాలో కరోనా(Russia covid cases) విలయ తాండవం కొనసాగుతోంది. ప్రతిరోజు 30 వేలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలతో ఆ దేశం వణికిపోతోంది. కొత్తగా 36,446 మందికి వైరస్(Corona virus in Russia) బారినపడ్డారు. మరో 1,106 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే ప్రథమం.
కరోనా(Russia covid cases) వ్యాప్తి కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ ఏడు వరకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మ్యూజియాలు, థియేటర్లు, కన్సర్ట్ హాల్స్ వంటి ప్రదేశాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉంది. అదీ టీకా తీసుకున్న వారికి మాత్రమే.
సెలవులిస్తే టూర్లు!
60 ఏళ్లు పైబడి, టీకా తీసుకోని వ్యక్తులు ఇంట్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. మాస్కుల వినియోగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకవైపు కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే.. అక్కడి ప్రజలు వాటిని విహార యాత్రలతో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విమాన టికెట్ల అమ్ముడయ్యాయని, హోటళ్లలో గదులు నిండిపోతున్నాయని, పర్యటక ప్యాకేజీలకు డిమాండ్ పెరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
టీకాలు తీసుకోకపోవడమే..
ఎక్కువమందికి టీకాలు తీసుకోకపోవడమే తాజా వైరస్ ఉద్ధృతికి కారణమని నిపుణులు అంటున్నారు. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మంది మాత్రమే పూర్తిగా టీకా వేయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట టీకాను ఆవిష్కరించిన ఆ దేశంలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.3లక్షల మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు.
మరోవైపు.. ఉక్రెయిన్పై కరోనా పంజా విసురుతోంది. తాజాగా ఆ దేశంలో 734 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చూడండి: