Russia Ukraine news: ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలు డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌కు స్వతంత్ర హోదా గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్న రష్యా పరిస్థితులను మరింత వేడెక్కించింది. రెండు ప్రాంతాలకు సైనిక సహకారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్న పుతిన్ ఆదేశాలతో ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధాన్నిపరోక్షంగా ప్రకటించినట్లయింది. ఈ మేరకు శాంతి పరిరక్షణకు ఆయాప్రాంతాల్లో రష్యాసైనిక దళాలను మోహరించాలన్న పుతిన్ ఆదేశాలతో వేర్పాటు వాదుల నియంత్రణలో ఉన్న డొనెట్స్‌క్ నగరం వైపు ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు వెళ్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. డొనెట్స్‌క్‌కు సమీపంలో ఐదు, నగరంలో మరో 2 యుద్ధ ట్యాంకులు కనిపించాయని పేర్కొంది. అయితే ఆ వాహనాలపై ఎలాంటి చిహ్నాలు కనిపించలేదని రాయిటర్స్ వివరించింది.
డొనెట్స్‌క్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు..
రష్యా సేనల రాకతో డొనెట్స్‌క్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే తిరుగుబాటుదారులు, ఉక్రెయిన్ సైన్యం మధ్య కాల్పులతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు తలెత్తాయి. అనేక ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. భయానక దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
గరిష్ఠ స్థాయికి చమురు ధరలు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలతో రష్యాలో చమురుధరలు ఏడేళ్ల గరిష్టస్థాయికి చేరాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ పడిపోతోంది. డాలర్‌కు 80 రూబుల్‌ల కంటే ఎక్కువకు చేరింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలను చవిచూస్తున్నాయి.
ఉక్రెయిన్.. రష్యాలో అంతర్భాగమే..
ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిసూ ఉత్తర్వులు జారీ చేశారు. పుతిన్ ప్రకటనతో ఉక్రెయిన్‌ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు డొనెట్స్‌క్, లుహాన్స్‌క్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగమని చరిత్ర చెబుతోందని గుర్తుచేసిన పుతిన్.. రెండు దేశాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. రష్యాను కట్టడి చేసేందుకు ఆయా ప్రాంతాలను పశ్చిమ దేశాలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. రష్యాపై వ్యతిరేక చర్యలను అడ్డుకునే హక్కు తమకు ఉందని తేల్చిచెప్పారు. ఈ ప్రాంతాల్లో రష్యా మద్దతు ఉన్న వేర్పాటు వాదులకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య చాలా ఏళ్లుగా పోరాటం కొనసాగుతోంది. ఈ క్రమంలో తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా ప్రకటిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రష్యా బలగాలు డొనెట్స్‌క్‌లోకి ప్రవేశిస్తున్నాయి.
ఇదీ చూడండి:
ఎవరికీ భయపడం.. వెనకడుగు వేయం: ఉక్రెయిన్
రష్యా చర్యపై ఆ దేశాల ఆగ్రహం.. అమెరికా ఆంక్షలు