రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా మరో అడుగు ముందుకేశారు. పుతిన్‌ను అధ్యక్షుడిగా 2036 వరకు పదవిలో ఉంచేందుకు.. అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు జులై 1న ప్రజాభిప్రాయ సేకరణను (ప్లెబిసైట్) నిర్వహించనున్నారు. ఈ అంశమై రష్యాలోని ముఖ్యనేతలతో వీడియో కాల్ ద్వారా సంభాషించిన పుతిన్.. దేశంలో వైరస్ కేసులు తగ్గుతున్నందున ఎన్నికలు సజావుగా సాగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో నెగ్గితే 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు పుతిన్‌కు మార్గం సుగమమవుతుంది.
పదవీకాలం పొడిగించేందుకే..
ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికకు పోటిచేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పుతిన్‌కు మరో అవకాశం కల్పించేందుకే ఈ ప్లెబిసైట్‌ను నిర్వహించనున్నారు. ప్రస్తుత పదవీకాలం ప్రకారం 2024 వరకు పుతిన్ అధ్యక్షుడిగా ఉంటారు.
ఆరు రోజుల ముందునుంచే..
ఎన్నికల నిర్వహణకు నెలరోజుల ముందుగానే తేదిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు పుతిన్. ఈ వ్యవధిలో వైరస్ నియంత్రణకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరురోజుల ముందు నుంచే ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు రష్యా అధికారులు ప్రకటించారు.
బయటకు రానున్న ప్రజాభిప్రాయం..
పరిపాలనా విధానంలో జనవరి నుంచి సంస్కరణలు ప్రవేశపెట్టారు పుతిన్. ఆయన విధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజలు తమ అభిప్రాయం తెలపనున్నారని రష్యా ముఖ్యులు భావిస్తున్నారు.
సుదీర్ఘకాలం పదవిలో..
సోవియెట్ నేత జోసెఫ్ స్టాలిన్ అనంతరం అత్యంత ఎక్కువకాలం రష్యా అధ్యక్ష పదవిలో ఉన్న నేతగా పేరుగాంచారు పుతిన్. 2000వ సంవత్సరం నుంచి ప్రధానిగా, అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: కుమారుడు పుట్టాలని కుమార్తెను బలిచ్చిన తండ్రి