ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38.53 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 2.66లక్షల మంది మృతి చెందారు. ప్రాణాంతక వైరస్ సోకి 13.17లక్షల మంది కోలుకున్నారు.
రష్యాలో 24 గంటల్లో 11 వేల కేసులు
రష్యాలో కరోనా వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట పడటం లేదు. అక్కడ రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 11,231 మందికి వైరస్ సోకడం వల్ల ఆ దేశంలో కొవిడ్-19 బాధితులు లక్షా 77 వేలకు చేరుకుంది. మరో 88 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,625కు పెరిగింది. 23,803 మందికి వైరస్ నయమైంది.
అమెరికాలో 13లక్షలకు చేరువలో కేసులు
వైరస్‌తో తీవ్ర ప్రభావితమైన అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 13లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ 75వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
స్పెయిన్‌లో 268 మంది మృతి
స్పెయిన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా మరణాలు మాత్రం ఆగట్లేదు. ఇవాళ 213 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 3,173 మందికి వైరస్ సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 2,56,855కు చేరింది. వీరిలో 1,63,919 మంది కోలుకున్నారు.
సౌదీ అరేబియాలో 219 మంది మృతి
సౌదీ అరేబియాలో కరోనా కోరలు చాచుతుంది. రోజూ పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 1,793 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 10 మృతి చెందారు. దీంతో ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 219కి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 33,731 మంది బాధితులు ఉన్నారు.
మెక్సికోలో ఇవాళ 1600 కేసులు
మెక్సికోలో ఇవాళ 1,609 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మరో 197 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 2,704కు చేరింది. దేశంలో 27,634 మంది మహమ్మారి బాధితులు ఉండగా.. 17,781 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇరాన్లో 24 గంటల్లో 1,485 కేసులు
గత కొద్ది రోజులుగా వందల సంఖ్యలోనే నమోదైన కేసులు.. ఇవాళ వేల సంఖ్యకు చేరుకున్నాయి. కొత్తగా 1,485 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య లక్షా 3 వేలకు ఎగబాకింది. అక్కడ ఇప్పటి వరకు 6వేల 486 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్‌లో 564 మంది మృతి
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో వైరస్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. తాజాగా 859 మంది వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం 24 వేల మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. ఇవాళ మరో 20 మృతి చెందగా... దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 564కు చేరింది. 6,464 మంది కోలుకున్నారు.
సింగపూర్‌లో వైరస్ ప్రతాపం
సింగపూర్‌లో వైరస్ విజృంభిస్తునే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 741 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 21 వేలకు చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 20 మంది మాత్రమే మృత్యువాతపడటం గమనార్హం.
బెల్జియంలోనూ పెరుగుతున్న కేసులు
బెల్జియంలో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న కారణంగా ఆ దేశంలో మొత్తం 51,420 మందికి వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో మరో 76 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 8,415 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
నెదర్లాండ్స్‌లో 5 వేలు దాటిన మరణాలు
నెదర్లాండ్స్‌లో ఈ రోజు 455 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 41,774కు పెరిగింది. వీరిలో 5,288 మంది వైరస్‌కు బలయ్యారు.