Cause of Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే మూల కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత తొలిసారి అధికారంగా స్పందించిన ఉత్తరకొరియా.. విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో ఓ పోస్టును పొందుపర్చింది.
తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా అగ్రరాజ్యం సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా అధిక జోక్యం, ఏకపక్ష ధోరణే కారణమని, ఆ దేశం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. శాంతి, స్థిరత్వం పేరిట ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని, తమ జాతీయ భద్రత కోసం ఇతర దేశాలు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను ఖండిస్తోందని చెప్పింది. అమెరికా సుప్రీం లీడర్‌గా వ్యవహరించే రోజులు పోయాయని పేర్కొంది.
మరో క్షిపణి ప్రయోగం
మరోవైపు ఆదివారం ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఒక్క జనవరిలోనే ఉత్తరకొరియా ఏడు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. కాస్త విరామం ఇచ్చిన ఉత్తర కొరియా తాజాగా ఎనిమిదో ప్రయోగం చేపట్టింది. ఉక్రెయిన్, రష్యా పోరు నేపథ్యంలో అవసరమైన అణ్వాయుధాల అభివృద్ధికి, బలోపేతానికి ఇదే సరైన సమయంగా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చూడండి:
రష్యాపై అమెరికా, మిత్ర దేశాల స్విఫ్ట్ అస్త్రం- కీలక బ్యాంకులు తొలగింపు