Robots In Winter Olympics: ప్రపంచ దేశాలపై ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో మనుషుల కాంటక్ట్‌లను తగ్గించే ప్రయత్నంలో రోబోలు కీలకంగా మారాయి. దీంతో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కి వచ్చే వీక్షకులను ఆకర్షించేందుకు బీజింగ్‌లోనూ పలు హోటళ్లు రోబోల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆహారాన్ని రోబోల చేత అందించడం ద్వారా వ్యక్తి ప్రమేయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.
బీజింగ్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ రోబో సర్వెంట్‌ను చూసి అక్కడికి వచ్చే అతిథులు ఆశ్చర్యపోతున్నారు. హోటల్‌లోని ప్రతి గది వద్దకు స్వయంగా వెళ్లి రోబో ఆహారాన్ని అందిస్తోంది. రోబోకు ఉన్న స్క్రీన్‌పైన పిన్‌కోడ్ నమోదు చేస్తే ఆర్డర్ చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు రోబోలు అనుమతిస్తాయి. ఆర్డర్ చేసిన వారు.. ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత రోబోకున్న తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి. ఇలా హోటలోని ప్రతి గదికి రోబో ఆహారాన్ని సరఫరా చేస్తోంది.
బీజింగ్‌లోని మరో హోటల్ సైతం కస్టమర్ల కోసం రోబో సేవలను అందుబాటులోకి తెచ్చింది. రోబోలే ఆహారాన్ని అందించేలా అధునాత ఏర్పాట్లను చేసింది. ఆహారం తయారీ నుంచి వండిన పదార్ధాలను కస్టమర్ ప్లేటులోకి చేర్చే వరకూ ప్రతి దశలోనూ రోబోలే సేవలు అందిస్తున్నాయి.
కేవలం ఆహారం అందించడమే కాకుండా మత్తు పానియాలను షేక్ చేసి మరీ స్వయంగా రోబోలే అందిస్తున్నాయి. కాక్‌టైల్ వంటి పానియాలను కలిపి ఇస్తున్నాయి.
ఇదీ చూడండి: ఒలింపిక్స్ వేళ చైనాలో కరోనా కలకలం.. బీజింగ్‌లోని ఆ ప్రాంతం సీజ్