లెబనాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించాల్సిన ప్రభుత్వం....కొత్త పన్నులు విధించడాన్ని నిరసిస్తూ వేలాదిమంది దేశ రాజధాని బీరుట్ సహా పలు నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. రహదారులపై టైర్లను కాల్చి రాకపోకలను అడ్డుకున్నారు. బీరుట్లో సచివాలయం, పార్లమెంట్ భవనం సమీపంలో వేలాదిమంది నిరసనకు దిగారు.
ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
ప్రధాన కార్యాలయంలోకి ఆందోళనకారులు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడం వల్ల భద్రతాదళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు భద్రతాదళాలపైకి రాళ్ళు, బూట్లు, నీళ్లసీసాలు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో పోలీసులు, పెద్దసంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు.
మూతబడ్డ సంస్థలు
ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టిన నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాజేసిన ప్రజాధనాన్ని తిరిగి ఇవ్వాలని నినదించారు. హింసాత్మక పరిస్థితులు నెలకొనడం వల్ల బ్యాంకులు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేశారు.
తలవంచిన ప్రభుత్వం
ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటం వల్ల ప్రభుత్వం దిద్దుబాటుచర్యలు చేపట్టింది. వాట్సాప్ కాల్స్‌పై విధించిన పన్నును ఉపసంహరించుకుంది. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన లెబనాన్ ప్రధాని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలపై ప్రతిపక్షాలు తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : బ్రెగ్జిట్ భవితవ్యాన్ని తేల్చనున్న చారిత్రక 'ఓటింగ్'