శ్రీలంక పోలీసు శాఖాధిపతి పుజిత్ జయసుందరను విధుల నుంచి తొలగించారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. వరుస పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇటీవలే రాజీనామా చేసిన రక్షణ శాఖ కార్యదర్శి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. దేశంలో ఈస్టర్ రోజున జరిగిన ఉగ్రదాడుల తర్వాత రక్షణ వ్యవస్థను సంస్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు సిరిసేన.
కొత్త పోలీస్ బాస్..
నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పోలీసు శాఖ అధిపతి జయసుందర, రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండోను ఆదేశించారు దేశాధ్యక్షుడు. ఫెర్నాండో గత గురువారం రాజీనామా చేయగా... జయసుందర మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదు. రాజీనామా చేసినట్టు ప్రకటించినా... ఆయన ఎలాంటి పత్రాలు పంపలేదు. కార్యాలయాన్ని ఖాళీ చేయలేదు. అందుకే జయసుందరపై వేటు వేశారు సిరిసేన.
సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిసున్న సీడీ విక్రమరత్నె తాత్కాలిక పోలీసు అధిపతిగా నియమితులయ్యారు. ఎన్కే ఇల్లంగకూన్ను రక్షణశాఖ సలహాదారుడిగా నియమించారు సిరిసేన.
పార్లమెంటులో ఈ వారమే
పోలీసు అధిపతి జయసుందర తొలగింపు నిర్ణయానికి సంబంధించిన తీర్మానాన్ని ఈ వారమే పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని శ్రీలంక మంత్రి నళిన్ బండారా తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీలంకలో ఈస్టర్ రోజున జరిగిన ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో 253 మంది చనిపోయారు. 500మందికిపైగా గాయపడ్డారు.