శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రక్షణశాఖ మాజీ కార్యదర్శి, శ్రీలంక పోదుజన పెరామునా పార్టీ అభ్యర్థి గోటబయా రాజపక్స విజయం దాదాపుగా ఖరారైంది. తమకు 50 నుంచి 53 శాతం వరకు ఓట్లు వచ్చాయని.. ఇది స్పష్టమైన గెలుపని రాజపక్స అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోదరుడైన గోటబయా తనకు పట్టున్న సింహళీ ప్రాంతాల్లో సంపూర్ణ ఆధిక్యం సాధించారు. ఈ మేరకు ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
గోటబయా ప్రధాన ప్రత్యర్థి, యునైటెడ్ నేషనల్ పార్టీ నేత సాజిత్ ప్రేమదాసకు తమిళులున్న ప్రాంతాల్లో ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ గోటబయాను దాటలేకపోయారు. ఓటమిని అంగీకరిస్తూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని పేర్కొన్నారు ప్రేమదాస. శ్రీలంకకు 7వ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపారు.
గోటబయా ట్వీట్..
విజయోత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని తన మద్దతుదారులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు గోటబయా రాజపక్స. ఇది సరికొత్త ప్రయాణానికి నాంది అని.. విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ శుభాకాంక్షలు
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్సకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సారథ్యంలో ఇరుదేశాల మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షించారు.
చైనాకు అనుకూలం..
చైనాకు బలమైన మద్దతుదారుగా ఉన్న గోటబయా విజయంతో... హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దేశ కార్యకలాపాలు పెరిగేందుకు మరింత అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: బ్యాంకాక్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్