రాజకీయ స్థిరత్వం సహా ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు భారత్‌ను ప్రపంచంలోనే పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు మోదీ.
"రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు భారత్‌ను ప్రపంచంలోనే పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయి. వృద్ధిని ప్రోత్సహించడానికి, ఉపాధి మార్గాలను రూపొందించడానికి, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని విధానాలను రూపొందించింది. వీటి ద్వారా పారిశ్రామికవేత్తలు వారి పెట్టుబడుల ద్వారా మంచి రాబడి పొందుతారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రదేశాలు మీవే. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో అభివృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకోబోయే అభివృద్ధి కార్యక్రమాలు భారత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రూపే కార్డు సేవలు ప్రారంభం...
యూఏఈ పర్యటనలో భాగంగా భారతీయ డెబిట్, క్రెడిట్ కార్డు అయిన రూపే సేవలను ప్రారంభించారు ప్రధాని మోదీ. తద్వారా... రూపే కార్డు వినియోగించిన తొలి పశ్చిమాసియా దేశంగా నిలిచింది ఎమిరేట్స్.
2012లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రూపే కార్డును ఇప్పటికే సింగపూర్, భూటాన్ దేశాల్లో వినియోగిస్తున్నారు.
ఇదీ చూడండి: భారత్-పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ద్విముఖ వ్యూహం!