రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో శనివారం భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాల్లో రెండు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లటం ఇదే తొలిసారి.
ఐదు ఒప్పందాలపై సంతకం
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా.. సమాచార సాంకేతికత, క్రీడలు, వాణిజ్యం.. రంగాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై సంతకం చేశారు ఇరు దేశాల నేతలు. ఎనర్జీ, వ్యాపారం, ఆరోగ్యం, అభివృద్ధి సహకారం.. తదితర అంశాలపైనా చర్చించారు.
109 ఆంబులెన్స్ వాహనాలకు గుర్తుగా..
ప్రధాని నరేంద్ర మోదీ.. మానవతాదృక్పథంతో బంగ్లాదేశ్‌కు అందించిన 109 ఆంబులెన్స్ వాహనాలకు గుర్తుగా తాళంచెవిని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు అందించారు. బంగ్లాదేశ్‌కు 1.2 మిలియన్ కొవిడ్-19 వ్యాక్సిన్లు అందించినందుకు గుర్తుగా ఓ బాక్సును సైతం అందించారు.
బంగబంధు జన్మదినం గుర్తుగా
బంగబంధు షేక్ ముజీబుర్ రహ్మాన్ జన్మదినం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీకి బంగారు నాణెంను, బంగ్లాదేశ్ ఏర్పడి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా వెండి నాణెంను బహుమతిగా ఇచ్చారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.
అనంతరం ఇరు దేశాల నేతలు.. వర్చువల్‌గా కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తోనూ సమావేశమయ్యారు.
'మైత్రి దివస్'
ఏటా డిసెంబర్ 6న మైత్రి దివస్‌ను నిర్వహించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. భారత్.. బంగ్లాదేశ్‌ను అధికారికంగా గుర్తించిన సందర్భంగా ఆరోజును ఏటా మైత్రి దివస్‌గా నిర్వహించాలని తీర్మానించాయి.
ఇదీ చదవండి : కరోనా నుంచి విముక్తి కోసం మోదీ పూజలు