కరోనా జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ పరిశోధనా కేంద్రంలో చైనా సైన్యం అనేక ఏళ్లుగా జంతువులపై రహస్య పరిశోధనలు జరుపుతోందని ఆరోపించారు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మాథ్యూ పోటింగర్. కొవిడ్ విజృంభణను కప్పిపుచ్చేందుకూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ప్రయత్నించిందని చెప్పారు.
కరోనా పుట్టుకకు వుహాన్ ల్యాబ్‌లో జరిగిన పరిశోధనలే కారణమని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఈ ఆరోపణలు చేశారు మాథ్యూ. 2019 సెప్టెంబర్-అక్టోబర్ నుంచే కరోనా విజృంభించిందని ఉద్ఘాటించారు.
"వుహాన్‌లో కొత్త రకం నిమోనియా(కరోనా) కేసులు నమోదు కాక ముందే... 2019 చివర్లో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు కచ్చితంగా ఫ్లూ తరహా అనారోగ్యం బారిన పడి ఉంటారని భావిస్తున్నా.
చైనా అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ)పై అమెరికా అతిగా ఆధారపడడం తప్పు అయింది. అలా చేయడం వల్ల అమెరికా ఆరోగ్య శాఖ అధికారులకు సరైన సమాచారం అందలేదు. నిజానికి కరోనా వ్యాప్తి గురించి డిసెంబర్ 31వరకు చైనా సీడీసీ డైరెక్టర్‌కు సమాచారం లేదు. వుహాన్‌లో కరోనా కట్టడి బాధ్యతల్ని చైనా ప్రభుత్వం ఆ దేశ సైన్యానికే అప్పగించింది. అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది."
-మాథ్యూ పోటింగర్, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు.
ఇదీ చదవండి: 'పేదరికంపై చైనా సంపూర్ణ విజయం!'