జమాత్ ఉద్ దవా నేత హఫీజ్ సయీద్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు నిర్ణయం తీసుకుంది. 2008 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్‌ను ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలతో జులై17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ రోజే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. హఫీజ్ కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలు ఆగస్టు 7లోగా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు.
సయీద్ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
జేయూడీని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే గుర్తించింది అమెరికా. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు బహుమానం ఇస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: మూకదాడులపై మోదీకి ప్రముఖుల లేఖ