పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీని అరెస్ట్ చేసింది ఆ దేశ అవినీతి నిరోధక శాఖ. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతుల కాంట్రాక్టుల కేటాయింపుల్లో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మీడియా సమావేశంలో పాల్గొనేందుకు లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న క్రమంలో నియాజ్ బైగ్ వద్ద అబ్బాసీ కారును అడ్డుకుంది జాతీయ జవాబుదారీ సంస్థ (న్యాబ్). అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా... పోలీసులతో కొద్దిసేపు వారించారు మాజీ ప్రధాని. చివరకు లొంగిపోయారు. న్యాబ్.. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం తదుపరి విచారణ కోసం రిమాండ్కు తరలించనున్నారు.
ఇదీ కేసు..
నవాజ్ షరీఫ్ కేబినెట్లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించారు అబ్బాసీ. అదే సమయంలో ఖతార్ నుంచి ఎల్ఎన్జీ దిగుమతుల కాంట్రాక్టులో భారీగా అవినీతి జరిగినట్లు న్యాబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఖండించిన అబ్బాసీ..
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మాజీ ప్రధాని అబ్బాసీ. నిర్దోషిగా నిరూపించుకుంటానని వెల్లడించారు.
2017 ఆగస్టు నుంచి 2018 మే వరకు పాక్ ప్రధానిగా పనిచేశారు ఖాకన్ అబ్బాసీ.
ఇదీ చూడండి: ఐసీజే తీర్పుపై భారత్ హర్షం.. విజయం తమదేనన్న పాక్