ప్రపంచ దేశాలు అఫ్గానిస్థాన్‌ను వదిలేయడం వల్ల.. ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేసే పనిని పాక్ మొదలుపెట్టింది. తాలిబన్ ప్రభుత్వంలో (afghan government formation) తాము సూచించిన వ్యక్తులకు పట్టాభిషేకం చేసేలా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తాలిబన్లలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఏకంగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడినే కొట్టారు. దీంతో పాక్ అనుకూల హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్లకు (taliban haqqani) మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకు పొక్కాయి.
'ఇదిగో రెండు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. వచ్చే వారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. అతి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..' ఇలా తాలిబన్లు పాతిక రోజుల నుంచి చెబుతున్నారు. అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడమే ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గత శుక్రవారం అనస్ హక్కానీ, ముల్లా బరాదర్ (mullah baradar) వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీనిలో ముల్లా బరాదర్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. పరిస్థితి చేజారుతుందని గ్రహించిన పాకిస్థాన్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ హమీద్‌ను (pakistan isi chief) ఆగమేఘాల మీద కాబుల్‌కు తరలించింది.
పట్టుబిగించిన పాక్..
తాలిబన్లలో అత్యంత శక్తిమంతమైన, ప్రమాదకరమైన గ్రూప్ హక్కానీ నెట్‌వర్క్ (haqqani network). ఇది అల్‌ఖైదాతో కూడా కలిసి పనిచేస్తోంది. హక్కానీ నెట్‌వర్క్ పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఇది నేరుగా తాలిబన్ సుప్రీం కౌన్సిల్‌కు రిపోర్టు చేస్తుంది. అంతేకాదు, తాలిబన్లలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న అత్యధిక మందితో కూడిన బృందం ఇదే. 'బద్రి 313' (badri 313 taliban) బృందం కూడా హక్కానీల పరిధిలోనే పనిచేస్తుంది. దీంతో మిగిలిన తాలిబన్ల మాట చెల్లనీయదు. హక్కానీలు పాక్‌కు (haqqani pakistan) పూర్తిగా అనుకూలంగా పనిచేస్తారు.
ముల్లా బరాదర్ విషయంలో పాక్‌కు అనుమానాలు..?
హక్కానీ నెట్‌వర్క్ తాలిబన్ అధినేతగా హిబాయితుల్లా అఖుంద్‌జాదాను (hibatullah akhundzada) అంగీకరించడంలేదని సమాచారం. అంతేకాదు ముల్లా బరాదర్ విషయంలో పాక్‌కు అనుమానాలు ఉన్నాయి. ఆయన్ను గతంలో పాక్ అరెస్టు చేసి జైల్లో వేసింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ పాక్ ప్రయోజనాలకు బరాదర్ అడ్డుపడే అవకాశం ఉందని భావిస్తోంది.
సైనిక ప్రభుత్వం వంటి మోడల్ కోసం పట్టు..
తాలిబన్ మిలటరీ కమిషన్ అధిపతి ముల్లా మహమ్మద్ యాకుబ్, హక్కానీ నెట్‌వర్క్ అధిపతి సిరాజుద్దీన్ హక్కానీలు మిలటరీ ప్రభుత్వం మోడల్‌ను అనుసరించాలని పట్టుబడుతున్నారు. వీరు తాలిబన్ బలగాలను నియంత్రిస్తుండటంతో ఈ విధానంలో తమ ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ నాయకత్వం సైనిక నేతల వద్దే ఉండాలని కోరుకుంటున్నారు. దోహ బృందంగా పేరుబడిన ముల్లా బరాదర్ వంటి రాజకీయ విభాగ నేతలు ఉండకూడదని వాదిస్తున్నారు. వీరు దోహాలో శాంతి చర్చలను కూడా బలంగా వ్యతిరేకించారు.
మరోపక్క బరాదర్ వర్గం మైనార్టీలను కూడా ప్రభుత్వంలో చేర్చాలని సూచిస్తోంది. కానీ, అధికారం పంచుకోవడానికి హక్కానీలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. కాబుల్‌ను ఆక్రమించాం కాబట్టి తమ ఆధిపత్యం ప్రభుత్వంలో ఉండాలని వాదిస్తున్నారు. మరోపక్క కీలక నేత ముల్లా యాకుబ్ ఇంకా కాందహార్‌లోనే ఉన్నారు.
ఐరాస నివేదిక ఏం చెబుతోంది..?
జూన్‌లో ఐరాస ఇచ్చిన నివేదిక ఈ పరిస్థితిని ముందే ఊహించింది. హక్కానీ నెట్‌వర్క్ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పింది. తాలిబన్ నాయకత్వం అంతర్గత విభేదాలు లేవని బయటకు ఎన్నిసార్లు చెప్పినా.. వివిధ తెగల మధ్య గొడవలు, వనరుల కేటాయింపులు, మాదక ద్రవ్యాలపై ఆదాయం, కమాండర్లకు లభించే స్వతంత్ర అధికారాలు వంటి అంశాలపై అభిప్రాయభేదాలు ఉంటాయని పేర్కొంది. ఇన్ని ఉన్నా.. వారి ఐకమత్యం బలంగానే ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
ప్రధానిగా ఉగ్రవాదిపేరు..
తాజాగా తాలిబన్ ప్రధానిగా ముల్లా హసన్ అఖుంద్ (mullah hasan akhund) పేరు వినిపిస్తోంది. హసన్ పేరు ఐరాస ఉగ్రవాదుల (UN terrorist list) జాబితాలో ఉంది. దీనికి బరాదర్ నేతృత్వంలోని రాజకీయ బృందం, హక్కానీ నెట్‌వర్క్, ముల్లా యాకుబ్ నేతృత్వంలోని కాందహార్ వర్గం అంగీకరించినట్లు సమాచారం. తాలిబన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా కొనసాగే అవకాశం ఉంది. ఆయన డిప్యూటీలుగా బరాదర్, ముల్లా యాకుబ్‌లు వ్యవహరించనున్నారు. ఇక అఫ్గాన్ ఇంటీరియర్ మినిస్టర్‌గా సిరాజుద్దీన్ హక్కానీ పేరు ముందుంది. పాక్‌కు ఐఎస్‌ఐ కనుసన్నల్లో హక్కానీ నెట్‌వర్క్‌కు అఫ్గాన్‌లోని కీలకమైన శాంతిభద్రతల బాధ్యతలు దక్కాయి. ఈ నెట్‌వర్క్‌కు ఐసిస్ ఖొరాసన్, అల్-ఖైదాతో సంబంధాలు ఉండటం విశేషం. కాబుల్ ఎయిర్‌పోర్టుపై దాడికి హక్కానీ నెట్‌వర్క్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి.
ఇదీ చదవండి: