తమ గగనతలంలో భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని పాకిస్థాన్ పొడిగించింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొన్ని రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు నిషేధం ఎత్తివేసేది లేదని స్పష్టం చేసింది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాక్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. దాడుల అనంతరం తమ గగనతలాన్ని వినియోగించకుండా అన్ని దేశాల విమానాలపై నిషేధం విధించింది పాకిస్థాన్. దిల్లీ, బ్యాంకాక్, కౌలాలంపూర్ మినహా ఇతర దేశాలకు మార్చి 27న సేవలను పునరుద్ధరించింది.
నిషేధం ఎత్తివేతపై మే 30 తరువాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ దేశ విమానయాన శాఖ అధికారులు తెలిపారు. భారత్‌లో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
లక్షల కోట్ల రూపాయల నష్టం..
భారత్‌తో పాటు బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు విమాన సేవలను నిలిపివేసిన పాకిస్థాన్ రోజుకు లక్షల కోట్ల రూపాయలు నష్టపోతోంది. ఒక రోజులో కౌలాలంపూర్‌కు నాలుగు, బ్యాంకాక్‌కు రెండు, దిల్లీకి రెండు విమానాలు నడుపుతోంది పాక్.
ఇదీ చూడండి: ఏప్రిల్ 2020 వరకు రాజ్యసభకు మన్మోహన్ దూరం?