పాకిస్థాన్ సైన్యానికి తాలిబన్లకు(Pak Taliban) ఎంతటి సన్నిహిత సంబంధాలున్నాయో ఆ దేశ అధికార పార్టీ నేత చేసిన వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఓ టీవీ షోలో పాల్గొన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకురాలు నీలం ఇర్షద్ షేక్.. కశ్మీర్ విషయంలో తాలిబన్లు పాక్‌కు అండగా ఉంటారని చెప్పారు.
'మాతో చేతులు కలుపుతామని తాలిబన్లు చెప్పారు. కశ్మీర్ విషయంలో సాయం చేస్తామని ప్రకటించారు' అని నీలం షేక్ అన్నారు. వెంటనే టీవీ షో యాంకర్ అప్రమత్తమయ్యారు. 'మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఆలోచించే ఈ స్టేట్మెంట్ ఇచ్చారా? ఈ షో ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది. భారత్ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తుంది' అని యాంకర్ నీలం షేక్‌కు సూచించారు. అయినా ఆమె తన వ్యాఖ్యలపై ఆందోళన చెందలేదు. తాలిబన్లు పాక్‌కు సాయం చేస్తారని మరోసారి స్పష్టం చేశారు.
అయితే కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోమని తాలిబన్లు(Afghan Taliban) ఇప్పటికే ప్రకటించారు. అది భారత్ అంతర్గత విషయమని, ద్వైపాక్షిక సమస్య అని చెప్పారు.
పాకిస్థాన్, దాని నిఘా విభాగం అండదండలతోనే తాలిబన్లు బలపడ్డారని అఫ్గాన్ ప్రభుత్వం గతంలో ఆరోపించింది.
ఇదీ చూడండి: తాలిబన్ల చేతికి 15 లక్షల మంది బయోమెట్రిక్ డేటా!