తన గగనతలంపై భారత విమానాలకున్న నిషేధాన్ని అయిదవ సారి పొడిగించింది పాకిస్థాన్. ఈ నిషేధం ఈ నెల 26 వరకు కొనసాగుతుందని ఆ దేశ పౌరవిమానయాన కార్యదర్శి షారుఖ్ నుస్రత్ వెల్లడించారు. సరిహద్దు వద్ద ఉన్న భారత వాయు సేన ఎయిర్ బేస్‌ల నుంచి యుద్ధ విమానాలను వెనక్కి తీసుకునే వరకు తమ గగనతలాన్ని తెరవబోమని స్పష్టం చేశారు.
"గగనతలం తెరవడంపై భారత ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తోంది. మా దేశానికి దగ్గర్లోని ఎయిర్ బేస్‌ల వద్ద యుద్ధ విమానాలను ఇంకా మోహరించి ఉంచడంపై మా ఆందోళనలను భారత్‌కు తెలియజేశాం. వాటిని వెనక్కి తీసుకొనే వరకు వాయుమార్గంపై విధించిన ఆంక్షలు కొనసాగుతాయి"
- షారుఖ్ నుస్రత్, పాక్ విమానయాన శాఖ కార్యదర్శి
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయు సేన ఫిబ్రవరి 26న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. అప్పటి నుంచి భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసేసింది.
గత నెల బిష్కెక్‌లో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి తన వాయు మార్గం ద్వారా ప్రధాని మోదీ విమానం ప్రయాణించడానికి పాక్ అనుమతించింది. కానీ మోదీ మాత్రం ప్రత్యామ్నాయ మార్గాన్నే ఎంచుకున్నారు.
పాక్ ఆంక్షల కారణంగా భారత వైమానికి సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ఎయిరిండియా అదనంగా రూ.430 కోట్లు ఖర్చు చేసిందని గురువారం భారత వైమానిక శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్లమెంటుకు వెల్లడించారు.
ఇదీ చూడండి: పాక్ వేర్వేరు ప్రమాదాల్లో 34కు చేరిన మృతులు