అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిర్ణయించింది. నిర్దేశించిన 27 విధుల్లో ఇంకా ఒకదాన్ని పూర్తి చేయటంలో ఆ దేశం విఫలమవ్వగా ఈ నిర్ణయం తీసుకుంది.
"పాకిస్థాన్‌పై పర్యవేక్షణ ఇంకా కొనసాగుతుంది. తనకు నిర్దేశించిన 27 విధుల్లో 26 అంశాలను పాక్ నిర్వర్తించింది. వివిధ ప్రాంతాల్లో మనీలాండరింగ్‌ను నిరోధించటంలో.. అంతర్జాతీయ ఎఫ్ఏటీఎఫ్ ప్రమాణాలకు తగ్గట్లు పని చేయటంలో పాక్ విఫలమైంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాద ముఠాల సీనియర్ నేతలను, కమాండర్లను దర్యాప్తు చేసే ఓ కీలకాంశాన్ని ఆ దేశం ఇంకా నిర్వర్తించాల్సి ఉంది."
-మార్కస్ ప్రీయర్, ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు
పారిస్‌లో ఎఫ్ఏటీఎప్ ప్లీనరీ సమావేశం జూన్ 21 నుంచి 25 మధ్య జరిగింది. పాకిస్థాన్‌పై ఆసియా పసిఫిక్ గ్రూప్ సమర్పించిన నివేదికను ఈ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ సమీక్షించింది. జూన్ 23న జరిగిన సమావేశంలో పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో ఉంచాలా? వద్దా? అనే దానిపై ఎఫ్ఏటీఎఫ్ చర్చించినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
గ్రే లిస్టులో ఉన్నందున అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి పాక్ ఎలాంటి ఆర్థిక సాయాన్ని పొందలేదు. మూడేళ్లుగా గ్రే జాబితాలోనే కొనసాగుతన్న పాకిస్థాన్.. ఆ జాబితా నుంచి బయటపడేందుకు విఫలయత్నం చేస్తోంది. అయితే.. ఉగ్రవాదులకు రక్షణ కల్పించటం, ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయకపోవటం వంటివి ఆ దేశానికి అంతర్జాతీయ నిధులను అందుకోవటంలో అడ్డంకిగా నిలుస్తున్నాయి.
ఏపీజీ నివేదికలో..
ఉగ్రవాదానికి నిధుల కట్టడి వ్యవహారంలో పాకిస్థాన్ స్థాయి స్వల్పంగా మెరుగుపడిందని ఈ నెల ప్రారంభంలో ఏపీజీ తెలిపింది. ఈ అంశంలో పాక్ రేటింగ్‌ను ఒకింత పెంచింది. మొత్తం 40 ప్రమాణాలకుగాను 21 అంశాల్లో పాక్ పురోగతి సాధించిందని పేర్కొంది. 'అధిక స్థాయి అనుశీలన' విభాగంలో కొనసాగించాలని నిర్ణయించింది. పాక్ తీరుతెన్నులపై మదింపు వేసి రెండో అనుశీలన నివేదికను వెలువరించింది.
ఇదీ చూడండి: ఉగ్రవాద నిధుల కోసం భారత్‌లో డ్రగ్స్ దందా!
ఇదీ చూడండి: 'ఉగ్రవాదులకు పింఛన్లు ఇచ్చే దేశం.. పాకిస్థాన్'