కొవిడ్‌పై పోరులో భాగంగా.. పాకిస్థాన్‌కు 5 లక్షల కరోనా టీకా డోసులను ఉచితంగానే అందించింది చైనా. పాక్ నుంచి పంపిన ప్రత్యేక విమానంలో.. వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం వద్ద చైనా రాయబారి నాంగ్ రాంగ్.. పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి వ్యాక్సిన్‌ను అందజేశారు.
''అల్లా దయతో.. మొదటి విడతలో సినోఫార్మ్ వ్యాక్సిన్ వచ్చేసింది. దీనికి సహకరించిన చైనాకు కృతజ్ఞతలు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు సెల్యూట్. వారికే మొదటగా టీకా ఇవ్వనున్నాం.''
- డా. ఫైసల్ సుల్తాన్, పాక్ ఆరోగ్య శాఖ సలహాదారు
ఈ వారాంతంలోనే పాకిస్థాన్ వ్యాక్సినేషన్ ప్రారంభించనుంది. మొదటగా ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్కు వ్యాక్సిన్ ఇవ్వనుంది పాక్ ప్రభుత్వం. టీకా కోసం ఇప్పటికే ఆ దేశంలో 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు.
రెండో విడతలో భాగంగా చైనా నుంచి మరో 11 లక్షల టీకా డోసులను కొనుగోలు చేయనుంది పాక్.
17 లక్షల డోసులు..
వీటితో పాటు.. ఈ ఏడాది ప్రథమార్థంలోగా పాకిస్థాన్‌కు 17 లక్షల ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాను అంతర్జాతీయ టీకా సమన్వయ సంస్థ 'కోవాక్స్' అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్ అలియన్స్ ఫర్ వాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) కూటమితో 'కొవాక్స్' ఏర్పడింది.
పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 5,46,428 కరోనా కేసులు నమోదయ్యాయి. 1683 మంది మరణించారు.
ఇదీ చూడండి: కంబళ వీరుడు శ్రీనివాస.. ఈసారి ఓడిపోయాడు