భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాశారు. పాకిస్థాన్ డే సందర్భంగా మోదీ పంపిన లేఖకు స్పందనగా ఇప్పుడు బదులిచ్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య నిర్మాణాత్మక, ఫలవంతమైన చర్చలు జరగాలంటే అందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. దక్షిణ ఆసియాలో శాంతి స్థాపనకు.. భారత్ పాక్ మధ్య ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ప్రత్యేకించి కశ్మీర్ వివాదం సమసిపోవాలన్నారు.
పాకిస్థాన్‌తో భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుందని, అయితే విశ్వాసమైన, ఉగ్రవాద రహిత వాతవరణం ఉంటేనే అది సాద్యమవుతుందని ఇమ్రాన్‌కు మోదీ గతవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఉగ్రవాద వాతావరణం ఉందొద్దని మోదీ లేఖలో పేర్కొంటే.. కశ్మీర్ వంటి సమస్యలు పరిష్కారమైతేనే శాంతియుత వాతావరణం సాధ్యమవుతుందని ఇమ్రాన్ బదులిచ్చారు. అంతేగాక కరోనాతో పోరాడుతున్న భారత ప్రజలు మమమ్మారిని అధిగమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఫిబ్రవరి 25న భారత్, పాక్ మధ్య కమాండర్ స్థాయి చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత కొద్ది వారాలకే ఇమ్రాన్, పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా శాంతి మంత్రం జపించారు. భారత్, పాకిస్థాన్‌లు గతాన్ని మరచిపోయి ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు.
ఇదీ చూడండి: సరిహద్దులో శాంతిపై భారత్-పాక్ కీలక నిర్ణయం